ఈ ఏడాది సాంకేతికపరంగా దర్శకనిర్మాతలు భారీ స్థాయిలో వెచ్చించడం జరిగింది. యమదొంగకు కథమీద కంటే టెక్నికల్ జిమ్మిక్కులు బాగా కనిపించాయి. అదే కోవలో అతిథి కనిపిస్తుంది. గత ఏడాది సైనికుడులో ఉపయోగించిన డిజిటల్ ఇంటర్మీడియట్ టెక్నాలజీ అతిథికి ఉపయోగించి అదనపు ఖర్చు మినహా సినిమాకు ఉపయోగపడింది ఏమీ లేదు. దీంతో కథలో ఫీల్ తెప్పించాలే గాని టెక్నికల్‌తో టెక్కు పోకూడదని అర్థం చేసుకున్నారు.
సీనియర్ దర్శకులు దాసరి నారాయణ లాంటి వాళ్లు కూడా ఫెయిల్యూర్స్‌ను చివిచూశారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగి ఆయన సరైన హిట్ సినిమా చేయలేకపోయాడు. మరోవైపు నిర్మాణ వ్యయం పెరిగిపోతుందనే గగ్గోలు పెడుతున్న నిర్మాతలు కూడా తమ దాకా వచ్చేసరికి చేతులు కట్టుకుని కూర్చోవలసి వచ్చింది. ఒక వస్తువును తయారు చేసి దాన్ని మార్కెట్ రేటు 10 రూపాయలుగా నిర్ణయించే ఉత్పత్తిదారుడు, వ్యాపారస్థుడు ఏదైనా అనండి.. సినిమా విషయంలో మటుకు చేతులెత్తేస్తున్నారు. ఫలానా సినిమా చేయాలంటే ఇంత బడ్జెట్ అంటే నియంత్రించలేక పోతున్నారు.
మార్కెట్‌లో ఒక్కో వస్తువుకు ఒక్కో మార్కెట్ ఉంటుంది. అలాగే సినిమా రంగంలో ఒక్కో హీరోకు ఒక్కో మార్కెట్ ఉంటుంది. కానీ నిర్మాతలు పరిమితి దాటిపోయి హీరోలకు ఎక్కువ పారితోషికాలు ఇచ్చేస్తున్నారు. తాజా ఉదాహరణే తరుణ్‌తో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రంలో ఇలియానాకు కోటి రూపాయలు ఇచ్చి పెట్టుకోవడం గమనార్హం. కాంబినేషన్‌లు చూసుకోవడం మినహా ఇది వర్కఅవుట్ అవుతుందా లేదా అన్నది... అనేది అస్సలు పట్టించుకోని జాడ్యం సినిమా రంగంలో ఎక్కువగా ఉంది. ఇక రీమేక్ రైట్స్ కోసమే అధికంగా వెచ్చించి శంకర్‌దాదా జిందాబాద్ చిత్రాన్ని తీసిన జెమినీ టీవీ యాజమాన్యం చేతికి జిగురు అంటించుకున్నారు.
అందుకే మరో నిర్మాత సీసీ రెడ్డి నేడు సినిమా రంగంలో క్రమ శిక్షణ తగ్గిపోతోందని వాపోతున్నారు. కార్పొరేట్ రంగం, సినిమారంగంలోకి రావడం మంచిదేనని అన్నారు. దాని వల్ల క్రమశిక్షణ, మొనోపొలి తగ్గుతుందని ఆయన భావం. ప్రతి దానికి జవాబుదారీ తనం ఉంటుందని సినిమా ఆగిపోవడం అనేవి ఉండదని, బడ్జెట్ నియంత్రణ ఉంటుందనే కఠోర సత్యాలు చెబుతున్నారు.
లక్కీ హీరోలు... తెలుగు ఇండస్ట్రీలో నిన్నా మొన్నటి వరకు శ్రీకాంత్‌కు లక్కీ హీరోగా పేరుండేది. సినిమా సక్సెస్‌తో నిమిత్తం లేకుండా వరుసనే సినిమాలు వచ్చేవి. ఈ ఏడాది ఆపరేషన్ దుర్యోధనతో మంచి సక్సెస్ సాధించిన శ్రీకాంత్ ఆచి తూచి అడుగులేస్తున్నాడు. ఈ ఏడాది లక్కీ హీరోలుగా శివాజీ, అల్లరి నరేష్‌లను అదృష్టం వరించింది. నీనవ్వే చాలు, నిక్కీ అండ్ నీరజ్, స్టేట్‌రౌడీ, సత్యభామ వంటి చిత్రాలతో పాటు మరి నాలుగు చిత్రాలు రెడీ ఉన్న శివాజీకి ఈ మధ్య తాజాగా విడుదలైనవి ఏవీ మంచి పేరు తెచ్చిపెట్టలేకపోయాయి.
|