కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం అందించిన ఫలాలతో భారతదేశం అభివృద్ధి మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. ముఖ్యంగా గడచిన సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు, ఈ సంవత్సరం పలు రంగాల్లో చోటు చేసుకున్న ఆశావహ దృష్టాంతాలు మిక్కుటంగా కనిపిస్తాయి. కర్షక లోకం నుంచి ఖగోళం దాకా ప్రతి రంగం కూడా ప్రజా బాహుళ్యానికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంలో తమ అస్తిత్వానికి సరికొత్త మార్గ నిర్దేశనం గావించుకున్నాయి. అదేసమయంలో కడివెడు పాలలో విషం చుక్క వలె చోటు చేసుకున్న పలు సంఘటనలు సగటు భారతీయునికి తీవ్రమైన మనోవేదనను మిగిల్చాయి.ఈ నేపథ్యంలో 2007లో దేశంలో చోటుచేసుకున్న పరిణామాలను సంక్షిప్తంగా అవలోకిస్తే...
ఆరని నందిగ్రామ్ మంటలు... కొత్త సంవత్సరం (2007)లోకి అడుగుపెట్టిన ఏడో రోజునే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నందిగ్రామ్‌లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నందిగ్రామ్‌లో ప్రత్యేక ఆర్థిక మండలం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఆ గ్రామ ప్రజలపై పోలీసులు తుపాకీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. నాడు ప్రారంభమైన నందిగ్రామ్ మంటలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా.. పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయింది.
ఎన్నికలు... గత ఫిబ్రవరి నెల 27వ తేదీన వెల్లడైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శిరోమణి అకాలీదళ్-భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి విజయభేరీ మోగించి పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు, భాజపా కూటమికి 67 స్థానాలు, ఇతరులు ఐదు స్థానాలు వచ్చాయి. అలాగే.. మే నెల ఏడో తేదీన ఏడు దశలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ బంపర్ మెజారిటీతో యూపీ పీఠాన్ని కైవసం చేసుకుంది.
దేశంలోని రాష్ట్రాల్లో అతి పెద్ద రాష్ట్రంగా పేరుగాంచిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రమాణ స్వీకారం చేశారు. 402 స్థానాలు కలిగిన యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చావుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేవలం 22 స్థానాలతో పరిమితమైంది. జూన్ నెల ఆరో తేదీన వెల్లడైన గోవా అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 40 స్థానాలకు గాను కాంగ్రెస్ 16, భాజపా 14, ఎన్సీపీ-03, ఇతరులు ఏడు స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసింది.
తొలి మహిళా రాష్ట్రపతి... భారతదేశ చరిత్రలో రాష్ట్రపతి పీఠాన్ని తొలిసారిగా ఒక మహిళ అధిరోహించారు. గత జులై నెల 25వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో దేశ 12వ రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆగస్టు పదో తేదీన జరిగిన ఎన్నికల్లో ఉపరాష్ట్రపతిగా జాతీయ మైనార్టీ కమషన్ ఛైర్మన్‌గా ఉన్న మహ్మద్ అన్సారీ ఎన్నికయ్యారు.
|