ఆఫ్ఘనిస్థాన్-ఇరాక్ : అమెరికా సేనల ప్రవేశంతో ఇరు దేశాల ప్రజలకు సామాన్య జీవనం కరువైపోయింది. అల్‌ఖైదా తీవ్రవాద సంస్థను కూకటి వేళ్లతో పెకలిస్తామంటూ ప్రకటనలు గుప్పించిన అమెరికా సైన్యాధిపతులు, అందులో పూర్తిగా విఫలమైయ్యారని చెప్పడానికి నిదర్శనాలు అనేకం. దీంతో అమెరికా సైన్యం వెనక్కు మళ్ళితే తమ గతేమిటనే విచిత్రమైన పరిస్థితిని ఆయాదేశాల ప్రధాని మరియు రాష్ట్రపతులు ఎదుర్కుంటున్న వైనం అంతర్జాతీయ సమాజానికి సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తోంది.
బంగ్లాదేశ్-నేపాల్ : సుధీర్ఘకాలంగా ఆపద్ధర్మ ప్రభుత్వాల పాలనలో మనుగడ సాగిస్తున్న దేశాలుగా బంగ్లాదేశ్, నేపాల్‌లు చరిత్రను సృష్టిస్తాయనడంలో సందేహం లేదు. అడవుల నుంచి రాచరిక ప్రభుత్వంపై పోరాటం సాగిస్తూ వచ్చిన మావోయిస్టులు, రాచరిక వ్యవస్థను కుప్పకూల్చడంలో ఘన విజయం సాధించారు.
అయితే పదవుల పంపకంలో అష్టపక్షాల కూటమి మధ్య చోటు చేసుకున్న బేధాలు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని చిరంజీవిని చేస్తున్నాయి. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధానులైన ఖలేదా జియా మరియు షేక్ హసీనాల మధ్య చోటు చేసుకున్న అంతర్‌యుద్ధం ఆ దేశానికి ఆపద్ధర్మ ప్రభుత్వ పాలనవైపు నెట్టింది.
శ్రీలంక-మియన్మార్ : అనాదిగా జాతుల మధ్య చోటు చేసుకున్న వైరం ఇరుదేశాల పాలిట ప్రాణ సంకటంగా పరిణమించింది. 2007 సంవత్సరంలోనే గగన తలం నుంచి శ్రీలంక సైనిక స్థావరాలపై దాడుల జరిపే ఆయుధ పాటవాన్ని తాము కలిగి ఉన్నట్లు తమిళ టైగర్లు తమ క్రియా శీలత ద్వారా చాటుకున్నారు. ఇక మియన్మార్ పాలకులు బౌద్ధారామాలపై, బౌద్ధ బిక్షువులపై దాడులతో అంతర్జాతీయ సమాజం నుంచి పలు ఆంక్షలను ఎదుర్కుంటున్నారు.
|