రాష్ట్రంలో 2007 సంవత్సరపు రాజకీయాలు మధ్యంతర ఎన్నికలు వచ్చేసినంత హడావుడి చేశాయి. ఎన్నికల ప్రణాళికను పరిగణనలోకి తీసుకున్నట్లయితే 2009 సంవత్సరంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కానీ అధికార, ప్రతిపక్షాలు మధ్యంతరాన్ని స్వాగతించే రీతిలో రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించాయి.
అదేసమయంలో సినీనటుడు చిరంజీవి రాజకీయ ఆరంగేట్రం చేయనున్నారనే వార్తలు ఊపందుకోవడంతో రాజకీయ పక్షాలకు ఎన్నికల జ్వరం మరింత పెరిగింది. ప్రధానంగా ఈ సంవత్సరాంతంలో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా చిరు అభిమానులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
దశాబ్దాల కాలపు కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడిన వెండితెర వేలుపు ఎన్ టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ స్థాయిలోనే తమ అభిమాన హీరో కూడా చరిత్ర సృష్టిస్తారనే అభిమానుల ఆరాటం తాలూకు ఊరేగింపులకు, సమావేశాలకు రాష్ట్రం సాక్షీభూతంగా నిలిచింది.
తన రాజకీయ రంగ ప్రవేశంపై చిరంజీవి పెదవి విప్పనప్పటికీ, అందుకు సంబంధించిన నేపథ్య కార్యకలాపాలు చాపకింద నీరులా సాగుతున్నాయని, సరియైన సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి అడుగిడుతారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
పాలిత కాంగ్రెస్ పక్షం, 2004 ఎన్నికలలో వామపక్షాలు, తెలంగాణా రాష్ట్రసమితితో కలిసి పోటీ చేసి గెలిచినప్పటికీ, ప్రస్తుతం మిత్ర పక్షాలతో సంబంధాలు సవ్యదిశలో సాగటం లేదు. మరోవైపు వామపక్షాలతో తెగిపోయిన బంధాన్ని పునరుద్ధరించుకునేందుకు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కసరత్తు ప్రారంభించింది.
పేదలకు సాగు భూమి మరియు ఇళ్ల స్థలాల కోసం మే నెలలో వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం, వామపక్షాల కార్యకర్తలపై ముదిగొండలో పోలీసు కాల్పులతో కాంగ్రెస్ మరియు వామపక్షాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి.
|