వివాదాస్పద రచయిత తస్లీమా నస్రీన్‌పై దాడి, నీలోఫర్ ఆసుపత్రి వైద్యసిబ్బందిపై తెగబడటం ద్వారా మిత్రపక్షమైన ఎమ్ఐఎమ్, కాంగ్రెస్‌కు లేనిపోని తలనెప్పులు తెచ్చిపెట్టింది.
కేంద్రంలో తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు దిశగా తెదెపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాంతీయ పార్టీలతో కూడిన యూఎన్‌పీఏ ఏర్పాటుకు నాంది పలికారు. సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) మరియు అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) తదితర రాజకీయ పక్షాలతో ప్రారంభమైన యూఎన్‌పీఏ ఆధ్వర్యంలో రైతు సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన తొలి బహిరంగ సభ విజయవాడలో జరిగింది.
తన తొమ్మిదేళ్ల పాలనలో హైటెక్ ముఖ్యమంత్రిగా పేరొందిన చంద్రబాబు నాయుడు తన వైఖరిని మార్చుకున్నట్లుగా ఈ సంవత్సరంలోనే ప్రకటించుకున్నారు. ఆర్థికాభివృద్ధి ఫలాలు పేద ప్రజలకు చేరువ చేసేందుకు వామపక్ష విధానాలను పాటిస్తామని చెప్పుకొచ్చారు.
రైతు సమస్యలపై సరియైన దృష్టిని పెట్టకపోవడంతో తాను అధికారాన్ని కోల్పోయినట్లు గ్రహించిన చంద్రబాబు, తాము తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామంటూ ప్రకటించారు.
అదేసమయంలో తామేమీ తీసిపోమన్న రీతిలో స్వర్గీయ ఎన్ టీ రామారావుకు ప్రియ పథకమైన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని వచ్చే సంవత్సరం నుంచి పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం ప్రకటించింది.
రైతులు, చేనేత కార్మికులకు మూడు శాతం వడ్డీకి రుణాలు అందిస్తామంటూ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి హామి ఇచ్చారు.
|