మీడియా పరిశ్రమ 2007 సంవత్సరంలో ఆర్థిక మరియు సాంకేతిక అభివృద్ధిని చవిచూస్తున్న తరుణంలో, మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న రీతిలో ఉమా ఖురానా నకిలీ స్టింగ్ ఆపరేషన్ ఈ ఏటి వార్తలలో ప్రధానంగా చోటు చేసుకుని మీడియా పరిమితులను గుర్తు చేసింది.
అదేసమయంలో మిడ్‌డే పాత్రికేయులకు జైలు శిక్ష సైతం సామాన్య ప్రజల దృష్టిలో పడింది. ఈ నేపథ్యం మీడియా స్వేచ్ఛ మరియు విలువలపై దేశ వ్యాప్తంగా చర్చకు ఆస్కారమిచ్చింది.
పైన పేర్కొన్న రెండు అంశాలు మీడియాకు గల ఒక కోణాన్ని ఆవిష్కరించగా, ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్‌ల వివాహం సందర్భంగా మీడియా చేసిన హంగామా ప్రధాన వార్తలకు చోటు దొరకని పరిస్థితిని కల్పించింది.
ఈ సంవత్సరం కొత్తగా 35 టీవీ ఛానెళ్ళు తమ కార్యకలాపాలను ప్రారంభించగా, మొబైల్ టీవీ సాంకేతిక పరిజ్ఞానం భారతీయ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వివాదాస్పదమైన ప్రసార నియంత్రణ బిల్లు ఈ సంవత్సరంలోనే అటకెక్కింది. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న ప్రవర్తనా నియమావళి, ఛానెల్ యజమానుల వ్యతిరేకతకు గురయ్యింది.
|