ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ తయారు చేసే ప్రక్రియ సెప్టంబర్-అక్టోబర్ మాసాల్లో మొదలవుతుంది. డిసెంబర్ మాసాంతానికల్లా అన్ని మంత్రిత్వ శాఖలు తమ తమ ఖర్చులు, కొత్త పథకాలకు చెందిన వివరాలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందిస్తాయి. ఇక్కడ నుంచి బడ్జెట్ రూపకల్పన ఊపందుకుంటుంది. ఈ కార్యక్రమం ప్రతి ఏటా జరుగుతూనే ఉంటుంది. బడ్జెట్‌ను తయారు చేయడమనేది నిరంతరం జరిగే ప్రక్రియలో ఒక భాగంగా చెప్పబడింది. బడ్జెట్‌లో రెండు అంశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. మొదటిది బడ్జెట్ వివరాలను వెల్లడిస్తే, రెండవది కొత్త ఆర్థిక విధానాలను తెలియజేస్తుంది. ఈ రెండు అంశాలను పాలకుల అనుమతితో రూపొందిస్తారు. దీని వివరాలు కేవలం ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రికి మాత్రమే తెలుస్తాయి. కొత్త పథకాలు సంబంధిత మంత్రిత్వ శాఖకు తెలుస్తుంది. అయితే పథకాల అమలు తీరు అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది.
కేంద్ర మంత్రివర్గ సభ్యులకు బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే సమయానికి ఒక గంట ముందు మాత్రమే బడ్జెట్ వివరాలు తెలుస్తాయి. ముందుగా ప్రకటించన రోజున ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడ్తారు. అదేరోజు ఉదయం 10 గంటలకు బడ్జెట్ వివరాలు కేంద్ర మంత్రివర్గ సభ్యులకు అందజేయబడతాయి. అయినప్పటికీ ప్రస్తుత కాలంలో బడ్జెట్ వివరాలను గోప్యంగా ఉంచడమనేది అతి క్లిష్టమైందిగా మారింది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకముందే వివరాలు బయటపడిన సందర్భాలు బడ్జెట్ చరిత్రలో కోకొల్లలుగా కనపడుతాయి. బడ్జెట్ రూపకల్పనలో ప్రపంచ బ్యాంక్ ప్రమేయముందని ఆరోపించే వారు కూడా లేకపోలేదు.
|