వచ్చే వార్షిక సాధారణ బడ్జెట్‌లో అన్ని రంగాలకు సమప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం కల్పించేదీ లేనిదీ అనే అంశంపై దేశవ్యాప్తంగా పలు వేదికల వద్ద చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రధానమైన 21 పథకాలకు కేటాయింపులను రెట్టింపు చేయాలంటూ యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతును ఇస్తున్న వామపక్షాలు ఇదివరకే కేంద్రప్రభుత్వానికి సంకేతాలు పంపినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. బడ్జెట్‌ను వేదికగా చేసుకుని వివిధ పథకాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధుల విధానాన్ని పూర్తి స్థాయిలో సంస్కరించేందుకు యూపీఏ ప్రభుత్వం చరిత్రను తిరగేసే కార్యక్రమానికి నాంది పలికింది.
గ్రామీణ భారతంలో వినియోగిత సరళి, జాతీయ వినియోగిత సరళికి మధ్య తలెత్తిన వ్యత్యాసాన్ని తొలిగించి సామాజిక రంగాలకు ఊతమిచ్చేందుకు ఎన్‌సీఎమ్‌పీని ఆధారంగా చేసుకుని యూపీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాలలో గృహనిర్మాణానికి 2005-06 సాధారణ బడ్జెట్‌లో రూ. 2,775 కోట్లు కేటాయించగా 2008-09 బడ్జెట్‌లో ఈ కేటాయింపు రూ. 5,4000 కోట్లుకు చేరుకునే అవకాశం ఉంది. అదేసమయంలో 2005-06 బడ్జెట్‌లో రూ. 4,235 కోట్లను ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజనకు ఈ సారి రూ. 7,530 కోట్లకు పెంచే అవకాశం లేకపోలేదు.
2005-06 సాధారణ బడ్జెట్‌లో ఈ 21 పథకాలకు రూ. 54,000 కోట్లను కేటాయించగా, మూడేళ్ల కాలవ్యవధిలోనే కేటాయింపును రూ. 1,09,000 కోట్లకు పెంచడం ద్వారా స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు పెంపుదలలో రాజీలేని దోరణిని అవలంబిస్తూ జాతీయ కనీస ఉమ్మడి కార్యక్రమానికి (ఎన్‌సీఎమ్‌పీ) తాను కట్టుబడి వైఖరిని కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తోంది.
అలాగే రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకం మరియు సమీకృత శిశు అభివృద్ధి పథకాలకు ఈ సారి జరిగే కేటాయింపులు దాదాపు 200 శాతం పెరగవచ్చు. అలాగే గ్రామీణ ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన మంత్రి సలహాదారుల బృందం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి మరియు జవహర్ లాల్ నెహ్రూ రెన్యూవల్ మిషన్‌కు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో నైపుణ్య వృద్ధి పథకం, జాతీయ వ్యవసాయ వృద్ధి పథకాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించవచ్చు.
|