పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2008-09 బడ్జెట్ మహిళలకు, రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా ఉండగలదని యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాయ్‌బరేలిలో రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ) భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు ఎనిమిది లేదా తొమ్మిది శాతానికి చేరుకున్నంత మాత్రాన సామాన్యుల జీవన ప్రమాణంలో పురోగతిని సాధించినట్లుగా భావించలేమని అన్నారు.
అందరికీ ఆరోగ్యం, విద్య తదితర కీలకరంగాల్లో సమగ్రమైన అభివృద్ధిని సాధించినప్పుడే ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని సోనియాగాంధీ పేర్కొన్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం మాట్లాడుతూ రైతులకు రుణాలివ్వడంలో బ్యాంకులు చురుకుగా పనిచేయడం లేదని అన్నారు. రాయ్‌బరేలి, సుల్తాన్‌పూర్ జిల్లాల్లో బ్యాంకు రుణాలు ప్రస్తుతం 35 శాతానికి చేరుకుందని వచ్చే సంవత్సర కాలంలో రుణాల శాతం 50కి చేరుకుంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
అయితే వంటావార్పుల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకునే ఉల్లిపాయ రేటు పెరిగిందంటే చాలు సగటు భారతీయ మహిళ అపర కాళికగా అవతరిస్తుంది. అంతెందుకు ఉల్లి రేటు తెచ్చిన ఘాటుకు హస్తినలో ప్రభుత్వాలు మారిపోయిన సంఘటన మన స్మృతులలో కదలాడుతూనే ఉంది. కేవలం బడ్జెట్‌ను ప్రవేశపెట్టి తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోద ముద్రను వేయించుకుని వరుసగా నాలుగవసారి కూడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత మాదేనంటూ గప్పాలు కొట్టుకునే పాలకులు, ఉన్నపళంగా మధ్యతరగతి ప్రజల జేబులను కొల్లగొట్టే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించని పక్షంలో ఏడు దస్తావేజుల బడ్జెట్ నామమాత్రంగానే మిగిలిపోతుంది.
|