తాజా అంచనాలను అనుసరించి రికార్డు స్థాయిలో రూ. 6,00,000 కోట్లకు మించి పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరుకోనున్నాయి. భారీ స్థాయిలో పన్ను వసూళ్లు 2008-09 బడ్జెట్‌లో సామాజిక రంగ పథకాలు, వ్యవసాయం, గ్రామీణ ఉపాధి, పరిశ్రమలకు వరాలు తదితరాలకు భారీగా కేటాయింపులు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి పి.చిదంబరానికి మార్గం సుగమమైంది. నార్త్ బ్లాక్ విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని అనుసరించి స్వాతంత్రం సిద్ధించిన అనంతరం తొలిసారిగా రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు జరగడంతో బడ్జెట్ అంచనాలు రూ. 5,48,122 కోట్లను అధిగమించవచ్చునని తెలుస్తోంది.
2009 సంవత్సరంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు సామాజిక రంగ కార్యక్రమాలైన విద్య మరియు ఆరోగ్య రంగాలకు అధికంగా కేటాయింపులు చేయవలసిన ఆవశ్యకతను గుర్తు చేస్తోంది. 'భారత్ వెలిగిపోతోంది' అంటూ గడచిన ఎన్నికల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం చేసిన ప్రచారం తిప్పికొట్టిన వైనం పాలకుల జ్ఞాపకాల నుంచి ఇంకా తొలగిపోలేదు. టెలికామ్ విప్లవం మరియు ఇతర రంగాలలో ప్రభుత్వం సాధించిన విజయాలు కేవలం ధనిక మరియ మధ్యతరగతి వర్గాలకు మాత్రమే సత్ఫలితాలు ఇస్తాయనే వాస్తవాన్ని సామాన్యుడు గత ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలింపజేశాడు. ఈ తరహా ప్రభుత్వ విజయాల పట్ల సామాన్య ప్రజలు విసిగిపోయి ఉన్నారు. సామాజిక రంగ కార్యక్రమాలు, వ్యవసాయ రంగాన్ని సంస్కరించవలసిన ఆవశ్యకతను జాతీయ సాధారణ కనీస కార్యక్రమం (ఎన్‌సీఎమ్‌పీ) గుర్తించింది. వ్యవసాయ రంగం సాలుకు నాలుగు శాతం వృద్ధిని సాధించని పక్షంలో రానున్న సంవత్సరాలలో ఎనిమిది శాతం వృద్ధి రేటును కొనసాగించలేమనే వాస్తవం ఇప్పుడిప్పుడే స్ఫురణకు వస్తోంది.
ఆరవ వేతన కమీషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునే దిశగా కేంద్ర మంత్రి చిదంబరం వార్షిక బడ్జెట్‌ను లిఖిస్తున్నారు. కమీషన్ సిఫార్సులను అనుసరించి కేటాయింపులు రూ. 36,000 కోట్లను తాకే అవకాశం ఉంది. తదనుగుణంగా ఆరవ వేతన కమీషన్ సిఫార్సులను అనుసరించి ఉద్యోగులకు రూ. 9,000 కోట్లు కేటాయించవలసిందిగా రైల్వే మంత్రిత్వ శాఖకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు జరుగడంతో వచ్చే బడ్జెట్‌లో పన్ను వసూళ్లను 18 నుంచి 20 శాతానికి పెంచే దిశగా ఆర్థిక మంత్రిత్వ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించనున్నది. ఈ సంవత్సరం ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని రూ. 2,70,109 కోట్లకు నిర్దేశించగా అది రూ. 3,30,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. బడ్జెట్ కసరత్తు చివరి క్షణాల్లో గ్రామీణ భారతానికి రూ. 90,000 కోట్ల ప్యాకేజీని బడ్జెట్‌లో జోడించేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.
ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 40 శాతం వృద్ధిని సాధించి మొత్తం పన్ను వసూళ్లలో 55 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన పన్ను వసూళ్లు భారతదేశపు జీడీపీలో ఇంచుమించు 13 శాతానికి చేరుకోవచ్చు. ఇందుకు తోడ్పాటుగా తప్పని సరిగా పాన్ కార్డు నెంబర్ ప్రస్తావన మరియు వార్షిక సమాచార నివేదికలను అందించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడంతో పన్ను ఎగవేతదారులు క్లిష్టపరిస్థితిని ఎదుర్కోవడంతో పన్ను చెల్లింపులు ఊపందుకున్నాయి. అదేసమయంలో సేవల పన్ను 30 శాతం వృద్ధిని సాధించింది.
|