ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > బడ్జెట్ 2008-09
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బడ్జెట్‌లో వ్యవసాయ రుణాల మాఫీ?!
వచ్చే వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రుణాలను మాఫీ చేసే అంశం చోటు చేసుకోవచ్చునని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఫిబ్రవరి 29 తేదిన పార్లమెంట్‌లో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగానికి పలు రాయితీలు ప్రకటించవచ్చునని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ వాణిజ్య రంగ అభివృద్ధితో పోల్చినట్లైతే, వ్యవసాయ రంగ అభివృద్ధి వెనుకబడి ఉందనే చెప్పవచ్చు. ప్రకృతి వైపరీత్యాల వలన వ్యవసాయం నష్టాలబాట పట్టడంతో రైతులు ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. దీంతో వ్యవసాయ రంగం నుంచి భారీ సంఖ్యలో ఇతర రంగాలకు వలసలు చోటు చేసుకుంటున్నాయి. అదేసమయంలో నిత్యావసర వస్తువులైన వంట నూనె, పప్పు ధాన్యాలను దిగుమతి చేసే పరిస్థితి నెలకొని ఉంది. సొంతగా ఉత్పత్తి చేయకపోగా, విదేశాలపై ఆదారపడాల్సి వస్తోంది.

మంచి దిగుబడిని అందించే సారవంతమైన వ్యవసాయ భూముల స్థానంలో అత్యాధునిక వసతులతో కూడిన కంపెనీలు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, గృహ సముదాయాలు చోటుచేసుకుంటున్నాయి. తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకు బండిని లాగుతున్న రైతులు తమ భూములను అమ్ముకుని నగరాలలో కూలిలుగా చేరిపోతున్నారు. ఈ దుస్థితికి కారణం కష్టపడి పండించిన పంటను అమ్మిన రైతులకు శ్రమకు తగ్గ ఫలితం లభించకపోవడమే. రైతుల రుణభారాన్ని తగ్గించే విధంగా వచ్చే బడ్జెట్‌ ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం భారత్ వెలిగిపోతుంది అనే నినాదాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకుంది. ఇందుకు ప్రతిగా గ్రామాలపై ప్రత్యేక దృష్టి అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ముందుకు తెచ్చింది.

గ్రామాల్లోని రైతుల పేదరికం, తలకు మించిన రుణ భారం తొలగిపోతుంది అంటూ ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీ కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైంది. రైతుల పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో బడ్జెట్‌ను ఎన్నికల ఎజెండాగా మార్చుకుని రైతుల కడగండ్లను తీర్చేందుకు పలు పథకాలను యూపీఏ ప్రభుత్వం ప్రకటించవచ్చు. భారత్‌లో వ్యవసాయ రంగానికి అందించిన రుణ మొత్తం రూ. 32 వేల కోట్లుగా నమోదైంది. ఈ మొత్తం రుణాన్ని పూర్తిగా మాఫీ చేయడం లేకపోతే కొంత మేరకు తగ్గించడం చేయవచ్చునని తెలుస్తోంది. వ్యవసాయ రంగ అభివృద్ధికి సుమారు రూ.90 వేల కోట్లతో పలు పథకాలకు కేంద్రం శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులలో ఎగవేతకు గురైన రుణ బకాయిలు రూ. 7,500 కోట్ల వరకు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా బ్యాంకుల ద్వారా రైతులు అందుకున్న రుణాల మొత్తం విలువ రూ. 30 వేల కోట్లకు చేరుకుంది. వచ్చే బడ్జెట్‌లో పైన పేర్కొన్న రుణ మొత్తాన్ని మాఫీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ వ్యవసాయ రంగ అభివృద్ధి వృద్ధి రేటు నాలుగు శాతానికి చేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను బడ్జెట్ ద్వారా ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని
పల్లె భారతానికి బడ్జెట్ వరాలు?!
మహిళలు, రైతులకు ఊతమిచ్చే బడ్జెట్
వార్షిక బడ్జెట్‌లో అభివృద్ధికి అగ్రతాంబూలం?!
రైలు ఛార్జీల పెంపుపై పెదవి విప్పని వేలు
బడ్జెట్ యొక్క గోప్యమైన అంకం
బడ్జెట్‌ దస్తావేజును ఎక్కడ ముద్రిస్తారు?