కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు నిధుల కేటాయింపు అరకొరగానే వుంది. ప్రస్తుతం రూ.1563.99 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని గత ఏడాదితో పోల్చితే రూ.36 కోట్లు తక్కువ అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కేటాయించిన మొత్తం నిధుల్లో ట్రాక్ మరమ్మత్తులకు రూ.400 కోట్లు, కొత్త లైన్లకు రూ.141 కోట్లు, గేజ్ మార్పిడి పనులకు రూ.127 కోట్లు కేటాయించారు.
ఇక రైల్వేలో అత్యంత కీలకమైన ప్రయాణికుల విభాగంలో నిధుల కొరత తలెత్తనుంది. ఈ విభాగంలో సౌకర్యాల కల్పనకు 103 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారు. హైదరాబాద్ పరిధిలోని ఎంఎంటిఎస్ రైళ్ళ నిర్వహణకు కేవలం 50 లక్షలు కేటాయించారు. ఈ కేటాయింపులపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరకొర నిధులతో నిర్వహణ అసాధ్యమని పేర్కొంటున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు ముఖ్యంగా రద్దీ సీజన్‌లలో ప్రత్యేక సర్వీసులను నడపడం మా వల్ల కాదని కుండబద్ధలు కొట్టి చెపుతున్నారు.
రైల్వే శాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోపై శీత కన్ను చూపిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత మూడేళ్లుగా దక్షిణ మధ్య రైల్వేకు అరకొర నిధులు కేటాయిస్తూ అన్యాయం చేస్తున్నారని వారు అరోపిస్తున్నారు.
|