ముఖ్యంగా.. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కొలువుదీర్చడం, దేవెగౌడ రాజీనామా అనంతరం లౌకిక పార్టీలన్నింటినీ కట్టుగా వుంచి ఐకే.గుజ్రాల్‌ను ప్రధానమంత్రిగా తెరపైకి తీసుకురావడం వంటివి సుర్జీత్ రాజకీయ పరిణితికి నిదర్శనం. పార్టీలంటే వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయడం కాదు. అవసరమైతే దేశంలోని ఇతర భావ సారూప్య పార్టీలను కలుపుకుని ముందుకు సాగడమేనని ఆయన పేర్కొన్నారు.
పదవుల కోసం పార్టీలను మంచినీళ్ళ ప్రాయంగా మార్చుతూ నోట్ల కట్టలకు అమ్ముడు పోయే నేతలున్న నేటి ప్రజాస్వామ్య భారతంలో సుర్జీత్ ఖచ్చితంగా అలాంటి వారికి మార్గదర్శకుడు. ఎన్నో మార్లు ఉన్నత పదవులను చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ సుర్జీత్ మాత్రం.. తృణప్రాయంగా కాదన్నారు. పదవులు ఉన్న సమయంలోనే పలుకుబడి కోసం ప్రాకులాడే నేతలు ఎందరో ఉన్నారు.
అయితే సుర్జీత్‌కు ఎలాంటి పదవులు లేకపోయినా, ఆయన మాటల పట్ల కమ్యూనిస్టు కార్యకర్తలకు, నేతలతో సహా పలు రాజకీయ పార్టీల వద్ద ఎనలైని గౌరవం ఉంది. ఓ మాట చెపితే చాలు.. క్షణాల్లో పనులు పూర్తి కావడం ఆయన అధికారంలో లేని 'పవర్'కు సాక్ష్యం. పార్టీ కార్యకలాపాల కోసం ఢిల్లీకి వచ్చే కార్యకర్తలకు ఆతిథ్యం ఇచ్చేందుకు పార్టీ నేతలు నానా తంటాలు పడే వారు. ఇది తెలిసిన మరుక్షణమే సుర్జీత్ ఢిల్లీలోని పలువురి ప్రముఖుల ఇళ్ళకు ఫోన్ చేసిన మరుక్షణమే రాజధానిలోని 'గురుద్వారా'లన్ని కార్యకర్తల కోసం తలుపులు తెరుచుకునేవి.
ఇలాంటి సంఘటనలెన్నో సుర్జీత్ జీవిత చరిత్రలో ఉన్నాయి. సాధారణంగా.. పార్టీ కార్యకలాపాల్లో మినహా ఇతర పనులపై అంతగా దృష్టి సారించని ఈ నేత.. పార్టీని బలోపేతం చేస్తూ.. విదేశాల్లో పర్యటిస్తూ ఉండేవారు. పార్టీ సిద్ధాంతవాదులకు కార్యకర్తల మధ్య సుర్జీత్ ఒక వారధిలా ఉండేవారు. తలపై తెల్లటి తలపాగా, చెరగని చిరునవ్వుతో ఎల్లపుడూ కనిపించే ఈ కురువృద్ధుని మృతి కేవలం కమ్యూనిస్టు పార్టీకే కాకుండా.. దేశానికి తీరని లోటే. |