సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఇదే ఉత్తరాయన పుణ్యకాలం. ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయనం మొదలవుతుంది. ఈ రోజున స్వర్గంలో వాకిళ్లు తెరుస్తారనీ, ఈ రోజు మరణించినవారు నేరుగా స్వర్గానికి వెళతారని చెప్పబడింది. అందుకే మహాభారత కాలంలో భీష్ముడు, కురుక్షేత్ర సంగ్రామంలో నేలకూలినా, ఉత్తరాయన పుణ్యకాలం కోసం ప్రాణాలు బిగబట్టుకుని, ఆ రోజు స్వర్గస్తుడవుతాడు.
ఈ రోజు పితృదేవతలకు తర్పణం విడుస్తారు. ఈ రోజు దానం చేయటం పుణ్యంగా చెప్పబడింది. సంక్రాంతి పండుగ రోజున ఏ దానం చేసినా మహా పుణ్యమే. అలాగే సంక్రాంతి రోజున కొత్త బియ్యంతో పొంగలి చేసి, సంక్రాంతి లక్ష్మికి నైవేద్యం పెడతారు. కొన్ని ప్రాంతాలలో నువ్వులను చక్కెర పాకంలో కలిపి, పూవుల్లాగా తీర్చిదిద్ది పంచి పెడతారు. ఇక సాయంత్రం వేళలో చిన్నవారు, పెద్దవారికి మొక్కి ఆశీర్వాదాలు పొందుతారు. అందుకే ఈ పండుగకు మొక్కుల పండుగ అని కూడా పేరు.
సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ. రైతులకు అతి ముఖ్యమైన ఈ పండుగరోజున ఉదయాన్నే లేచి కొట్టాలను శుభ్రం చేసి, చక్కగా అలికి ముగ్గులు పెడతారు. పశువులను కడిగి అలంకరించి పసుపు కుంకుమలను అద్ది, వాటికి పొంగలి నివేదన చేస్తారు.
సకల సౌభాగ్యాలతో దేశం కళకళలాడాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకే మన పెద్దలు విశ్వమానవ శ్రేయస్సు కోసం పండుగలను ఏర్పరిచారు. పండుగల ద్వారా మానవ కళ్యాణాన్ని సాకారం చేయటమే మన పండుగలలోని ప్రధాన ఉద్దేశ్యం.
|