|
గగనంలో గాలిపటాల సమరం
|
|
|
|
|
|
|
|
Mahesh
|
|
|
|
|
|
|
|
|
| | మరో నెల రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుందనగా హైదరాబాద్‌లోని మేఘాలను తాకడానికి పరిగెడుతున్నట్లుగా ఆకాశంలో అక్కడక్కడా పతంగులు (గాలిపటాలు) దర్శనమిస్తాయి. తమ రాజ్యంలోకి ఈ తోక రాయుడెవరా అంటూ గగనతలంలోని పక్షులు గాలిపటాన్ని అనుమానంగా చూస్తాయి. అంతేనా... వేటాడి వెంటాడి, వీలుంటే తమ కాళ్ళకున్న వాడి గోళ్ళతో పతంగాన్ని చీల్చిచెండాడటానికి ప్రయత్నిస్తుంటాయి. అయితే ఇటువంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ఎందుకంటే పక్షి కపటోపాయాన్ని ముందుగానే గ్రహించిన నేల మీదుండే గాలి పటం యజమాని మొదట గాలిపటం దిశను మళ్ళించేందుకు ప్రయత్నిస్తాడు. అప్పటికీ పక్షి తన వేటను విరమించుకోకపోతే గాలిపటాన్ని నేలమీదకు దించేసి శత్రుమూక నుంచి ప్రాణాలను రక్షించుకున్న కపోతాన్ని చేరదీసినట్లు పతంగు యజమాని దానిని ఆప్యాయతగా హత్తుకుంటాడు.
ఇక పండుగ సమీపిస్తుందనగా రంగురంగుల గాలిపటాలతో ఆకాశంలో ఇంద్రచాపం తొంగిచూసిన భావనకు చూపరులు లోనవుతారు. అంతేనా... అంబరంలో సంబరం చేసుకుంటామంటూ పతంగులు పెద్ద సంఖ్యలో తమ విహారాన్ని కొనసాగిస్తుండటంతో పక్షులు పత్తా లేకుండా పోతాయి. ఇక ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అప్పటిదాకా శాంతి కపోతంలా విహరించిన గాలిపటం కాస్త క్షిపణిలా మారుతుంది. పతంగును పైకి చేర్చే దారానికి గాజు పొడిని అద్ది పదును తేలుస్తాడు దారం చివర్న ఉన్న యజమాని.
ఇంకేముంది శంఖారావం లేకుండానే ఆకాశంలో పతంగుల రణరంగం ప్రారంభమవుతుంది. యుద్ధ వాతావరణం నెలకొనేసరికి పిల్లలతో పాటుగా పెద్దలు కూడా పతంగుల పోరాటంలో పాలు పంచుకోవడం మొదలుపెడతారు. యుద్ధరంగంలోని పతంగులు సైనికుడు, దళపతి, మంత్రి, రాజు తదితర రూపాలతో గాలివాటుగా బయలుదేరుతాయి. అరుపులు, కేకలతో గాలిపటాలకు వీర గంధం దిద్ది వినీలకాశంలోకి పంపుతారు పతంగుల యజమానులు.
వీధిలోని మూడవ మేడ మీద నుంచి బయలుదేరిన గాలిపటం క్రూరంగా చూస్తూ ఒకటవ మేడ మీద నుంచి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తున్న గాలిపటంను సమీపించేసరికి ఒకటి, మూడు మేడల నుంచి గాలిపటాలను నడుపుతున్న వారిలో మొదట ఉత్కంఠ, తర్వాత ఉత్సాహం, అటుపిమ్మట సవాళ్లు చేసుకునే స్థాయికి ఆవేశం చేరుకుంటుంది. మధ్యమధ్యలో ఇంట్లో నుంచి పైకి వచ్చే పిండివంటకాలపై తమ ప్రతాపాన్ని చూపిస్తూ పతంగులను రెచ్చగొడుతుంటారు.
|