సంక్రాంతి సంబరాల్లో భాగంగా... మూడో రోజు కనుమ పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ కనుమ పండుగ సందర్భంగా.. రైతులంతా కలిసి తమ నాగళ్ళను, ఎద్దుల బళ్ళను, ఎద్దులతో పాటు.. ఇతర పశుసంపదను శుభ్రం చేసి, వాటిని రంగవల్లులతో అలంకరించారు. గోమాతను పూలతో పూజించారు. ఈ పండుగకు ముందు.. భారతదేశంలో గొప్పగా జరుపుకునే హైందవ పండుగ మకర సంక్రాంతి ఒకటి. బలిచక్రవర్తి త్యాగ ఫలాలతో పునీతుడైన రోజు ఇది. వామన అవతారమెత్తినా శ్రీమన్నారాయణుడు లోకానికి దుష్టశిక్షణ, శిష్టరక్షణగావించిన పర్వదినం ఇది.
మూడు రోజుల్లో మధ్యదినాన్ని మకర సంక్రమణం, మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ రోజును సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. ఈ నాటితో చలి క్రమంగా తగ్గుముఖం పట్టివేడిమి పెరుగుతుంది. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు. మహాభారత యుద్ధంలో అర్జునుని శరాఘాతానికి నేలకూలిన భీష్మాచార్యులు ఈ పుణ్యకాలం కోసం వేచిచూసి ఇచ్ఛామరణాన్ని కోరుకున్నాడని చెబుతారు.
ఫిబ్రవరి నెలలో వచ్చే భీష్మేకాదశి నాడే ఆయన మృతిచెందాడు. ఆ మరుసటి రోజు వచ్చే పండుకే కనుమ. ఇది రైతుల పండుగగా పిలుస్తారు. తమ పెంపుడు పశు పక్ష్యాదులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. ఇలా.. కనుమ పండుగను దేశ రైతులతో పాటు.. దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.
జోరుగా కోడి పందేలు... సంక్రాంతి సంబరాలు అంటే కేవలం రంగవల్లు, గొబ్బెమ్మలు, హరిదాసులు, కొత్త అల్లుళ్ళ కోలాహలమే కాదు.. గ్రామీణ కళను మరింత శోభాయమానం చేసే కోళ్ళ పందేలు జోరుగా సాగుతాయి. ఈ పందేల చాటు లక్షల రూపాయల జూదం కూడా జరుగుతోంది. ఒకప్పుడు గ్రామాల్లో ఉల్లాసభరింతంగా సాగే కోడి పందాలు నేడు ఓ జూదంగా మారింది. కోడి పందాల నిర్వహణపై పోలీసులు ఎన్నో ఆంక్షలు విధిస్తున్నా.. అవి మాత్రం యధేచ్చగా సాగుతూనే వున్నాయి. ఈ పందేల కోసం.. కోడి పుంజుల పెంపకం ప్రత్యేకంగా జరుగుతుంది. ఆ కోడి పుంజుల విలువ కూడా వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు ఉంటుందని వినికిడి.
మేలు జాతి పుంజులను ఎంపిక చేసుకొని వేలకు వేలు హెచ్చించిన పందెగాళ్ళు కోడి పుంజులకు ప్రత్యేక ఆహారాన్ని ఇస్తారు. కోడి పందెంలో కోడి కాళ్ళకు కత్తులు కట్టి పందాలు వేసే వారు కొందరైతే వేలకు వేలు పై పందాలు కాసి జూదంలో లక్షల రూపాయలు కాజేసుకునే వారు మరి కొందరు ఉన్నారు. ఈ పందేల కోసం పెంచే కోళ్లు పలు రకాలుగా వుంటాయి. వీటిలో నెమలి, కెక్కర, కాకిడేగ, పెట్ట మార్కపుంజు, మైల, అబ్రాస్ తెల్లమైల ఇలాంటివి కొన్నిరకాలు. అలాగే.. కోళ్ళకు కట్టే కత్తుల్లో కూడా రకాలు వున్నట్టు కోడిపందేల నిర్వాహకులు చెపుతున్నారు.
|