భారత రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు. సర్వ సైన్యాధ్యక్షుడు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. ఐదేళ్ళ పాటు పదవీకాలంలో వుండే రాష్ట్రపతిని ఎలక్ట్రోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇలా బాధ్యతలు చేపట్టే రాష్ట్రపతి తనకు సంక్రమించిన అధికారాలతో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం పార్లమెంటు ఉభయసభలను సమావేశపరుస్తారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు.
ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న రాష్ట్రపతి పీఠానికి పోటీ చేసే అభ్యర్థి భారత పౌరుడై వుండి, 35 సంవత్సరాల వయస్సు నిండి వుండాలి. అలాగే లోక్‌సభకు ఎన్నికయ్యే అభ్యర్థికి వుండాల్సిన అర్హతలు కలిగి వుండాలి. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి చేత భారత రాజ్యాంగంలోని 60వ ఆర్టికల్ ప్రకారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్రపతికి వివిధ ఉన్నత పదవులను అలంకరించేవారి నియామకం చేసే అధికారం ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన పార్టీ నుంచి ప్రధానమంత్రిని, అతని సలహాలు, సూచనలపై మంత్రిమండలిని, భారత త్రివిధ దళాధిపతులను, రాష్ట్ర గవర్నర్లను, ముఖ్య కమీషన్ల ఛైర్మన్లను, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను, అటార్నీ జనరల్, కంప్ట్రోరల్ ఆఫ్ ఆటార్నీ జనరల్, సుప్రీం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు.. ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు.
|