దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఒక లఘు చిత్రం పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమైంది. లఘు చిత్రం ప్రారంభం కాగానే ఒక నగరానికి చెందిన రహదారి మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. రహదారికి ఇరువైపులా గల కాలిబాట మీద పానీపూరీలు, దినపత్రికలు అమ్ముకునే వాళ్లు గుమిగూడి ఉంటారు. స్కూల్ అయిపోగానే తల్లితో కలిసి రహదారి చెంతకు వచ్చిన పిల్లవాడు ఒకడు పానీపూరీలు కొనివ్వమని మాతృమూర్తిని సతాయిస్తుంటాడు.
ఈలోపల రానున్న వర్షానికి పైలెట్ లాగా గాలిదుమారం లేచింది. తన దినపత్రికలను కాచుకునేందుకు దినపత్రికలు విక్రయించే వ్యక్తి వాటి దగ్గరకు పరిగెడుతుంటాడు. కాలిబాట మీద గడియారాలు బాగు చేసే వ్యక్తి తల మీద వాన నీటి చుక్కలు పడతాయి. దాంతో అతను కూడా తన సామాగ్రిని తీసుకుని పరుగు లంకించుకుంటాడు. అప్పటిదాకా నేల మీద కూర్చున్న బిచ్చగాడు, గాలికి ఎగిరిపోతున్న కరెన్సీ నోటు వెనుక పరిగెడుతుంటాడు.
అదే సమయంలో రేడియో నుంచి జనగణమన గీతం వినపడటం ప్రారంభమవుతుంది. తమ ప్రయోజనాల పరిరక్షణార్థం గీతాన్ని వినిపించుకోకుండా జనం పరిగెడుతుండగా... కాలిబాట పైన గల ఒక దుకాణానికి చెందిన వికలాంగులు తరుముకొచ్చే వానను లెక్కచెయ్యక... జాతీయ గీతానికి గౌరవ సూచకంగా దుకాణం పక్కన గల స్థంభాన్ని ఆసరాగా చేసుకుని అంకిత భావంతో నిలబడి ఉంటారు. వారికి సమీపంలోనే బూట్ పాలిష్ దుకాణంలో పనిచేసే మరో ముగ్గురు పిల్లలు కూడా నిలబడతారు. లఘు చిత్రం దృశ్యం కొనసాగుతుండగానే నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ స్వరం వినపడుతుంది.
"జాతీయ గీతాన్ని గౌరవించడంలో సిగ్గుపడతారెందుకు, జాతీయ గీతాన్ని గౌరవించడం... దేశాన్ని గౌరవించడంతో సమానం."
|