ప్రతి ఏటా స్వాతంత్రదినం, గణతంత్ర దినం మరియు గాంధీ జయంతి వస్తుంటాయి, వెళ్లిపోతుంటాయి. కానీ మన దృష్టిలో ఇవన్నీ కూడా కేవలం సెలవు దినాలు మాత్రమే. దేశం పట్ల గౌరవాన్ని ప్రకటించడంలో మనం పాతాళంలో ఉన్నాం. అందుకేనేమో 52 సెకండ్ల కాల వ్యవధి కలిగిన జాతీయ గీతం వినిపిస్తుంటే లేచి నిలబడటానికి వెనుకాడుతుంటాం.
ఒక్కసారి గత కాలపు వైభవాన్ని నెమరువేసుకుందాం...
అప్పట్లో అనేక సినిమా హాళ్లలో ఈ దృశ్యం సర్వసాధారణంగా కనిపించేది. ట్రయల్ పార్టీ (న్యూస్ రీల్) తోపాటుగా సినిమా ప్రదర్శన ముగియగానే జాతీయ గీతాన్ని హాలు నిర్వాహకులు వినిపించడం మొదలు పెడతారు. గీతం ప్రారంభం కావడం ఆలస్యం... హాలులోని ప్రేక్షకులందరూ జాతీయ గీతానికి గౌరవసూచకంగా లేచి నిలబడేవారు. కాలానుగుణంగా జాతీయ గీతం పట్ల మనలో తొలగిపోయిన గౌరవానికి నిదర్శనంగా ఆ సాంప్రదాయం కాస్త కనుమరుగైపోయింది.
దీని తాలూకు దయనీయమైన సంఘటన 1994లో చోటు చేసుకుంది. అదేసంవత్సరం '1942- ఏ లవ్ స్టోరీ' అనే హిందీ చిత్రం విడుదలైంది. ఆ చిత్రంలో జనగణమన గీతం వినపడే సందర్భంగా ఉండటంతో...
"దయచేసి జాతీయ గీతానికి గౌరవసూచకంగా లేచి నిలబడండి".
అనే ఉపవ్యాఖ్య ద్వారా నిర్మాత ప్రేక్షకులను వేడుకున్నారు. మన బానిస బతుకులకు మంగళం పాడటంలో కీలకపాత్ర పోషించిన శుభ ఘడియలకు నిదర్శనమైన జాతీయ పర్వదినాలను మించిన పండుగలు మన మతాలలో, ఆచారాలలో కాగడా పెట్టి వెతికినా కానరావు. దేశాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించడంలో ముందు వరుసలో నిలబడదాం... నవభారత నిర్మాణంలో చేయి చేయి కలుపుదాం...
జైహింద్
|