బ్రహ్మానందం కామెడీకే మంచి స్పందన... గత సంవత్సరంతో పోలిస్తే 2008 సంవత్సరం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అనుకూలించిందనే చెప్పాలి. నిజానికి ఈసారి కూడా చాలా చిత్రాలు ప్లాపుల ముద్ర వేయించుకున్నప్పటికీ చిన్న చిత్రాల హిట్ల సంఖ్య జోరు వాటిని మరచిపోయేలా చేసింది. ప్రజలను థియేటర్ వైపు రప్పించేలా కామెడీ చిత్రాలు ప్రయత్నించాయి. ఇతివృత్తం, టెక్నిక్, బడ్జెట్ విషయాలను తీసుకుంటే రకరకాల చిత్రాలు రూపొందినా అగ్రహీరోలకు విజయం అందని ద్రాక్షలా తయారైంది. సక్సెస్ కోసం హీరోలు సిక్స్‌ప్యాక్‌తో రకరకాల విన్యాసాలు చేసినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఏడాది ప్రారంభమే సంక్రాంతితో బాలయ్య చిత్రం విడుదలై బాక్సాఫీస్‌వద్ద బోల్తాపడింది. మరో చిత్రం కృష్ణకు కాస్త ఊరటనిచ్చింది.ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద దాదాపు 138 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 120 సినిమాలు పరాజయం పాలయ్యాయి. అందులో అగ్రహీలో చిత్రాలు వేళ్ళలో లెక్కించేవి 4, 5 మాత్రమే ఉన్నాయి. ఇన్ని సినిమాలు ప్లాపయినా ఈ ఏడాది చిన్న చిత్రాలకు అనుకూలించిందనే ఇండస్ట్రీ భావిస్తోంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈ ఏడాది అవే ఎక్కువగా విజయం సాధించాయి. ఎన్నో సాహస ఘట్టాలు... రక్తం, శృంగారం, వ్యాపారం అంశాలుగా హాలీవుడ్ చిత్రాలు ఆస్కార్ బరిలో ఉంటే... వర్తమాన సమాజం పరిస్థితుల్లో మన చిత్రాలు ముందు వరుసలో ఉన్నాయి. జాతీయ స్థాయి చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాకు సముచితమైన స్థానమే దక్కింది. "హోప్" జాతీయ స్థాయిలో సామాజిక స్పృహ కలిగిన ఉత్తమ చిత్రంగా నిలిచింది. లంబాడీల జీవన నేపథ్యంలో సాగిన "కమ్లి" ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ దఫాయే మొదలైన యానిమేషన్ విభాగంలో "కిట్టు" విజేత అయింది. ఇక తెలుగు భాషకు జాతీయ హోదా కల్పించడం మన ప్రత్యేకతని ఇండస్ట్రీ భావించినా, అది కార్యరూపంలోకి వచ్చేసరికి చిత్ర టైటిల్స్‌లోనూ ఏమాత్రం లేకపోవడం విచారకరం. |