ప్రధాన రాజకీయ స్రవంతిలో పాల్గొని ఏనాడూ పదవులను అలంకరించని వారిలో లోహియా, సుందరయ్య, జయప్రకాష్ నారాయణ్‌లు అగ్రగణ్యులు. అయితే తన జీవిత కాలంలో ఎన్నో పదవులను అలంకరించి, దశాబ్దాల పాటు ప్రజా జీవిత అనుబంధం కలిగిన నేత మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. పదుల సంవత్సరాల పాటు కాంగ్రెస్ వాదిగా ఉన్నప్పటికీ నిబద్ధత, విధి, నిర్వహణ, త్యాగనిరతి, అంకితభావంలాంటి ఉదాత్త లక్షణాలకు నిలయంగా ఆయనకు పేరుంది. దేశ సామాజిక పటాన్ని, రాజకీయాల గమనాన్ని సమూలంగా మార్చి వేసిన ఘనుడు. రాచకుటుంబంలో జన్మించిన సింగ్ జీవన శైలిలోగానీ, ప్రజా సంబంధాల్లో గానీ ఆ లక్షణాలు మచ్చుకైనా కనిపించవు. లాల్ బహుదూర్ శాస్త్రి శిష్యునిగా తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాలంలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన సింగ్ రాజకీయ జీవితమంతా సంచనాలే. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన నేత. ఇందిరా దృష్టిని ఆకర్షించిన ఘనుడు.. కేంద్రంలో డిప్యూటీ మంత్రిగా పని చేసిన సింగ్.. 1970 సంవత్సరంలో కాంగ్రెస్ ధీరవనిత ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డారు. అలా పదేళ్ళ తర్వాత సింగ్‌ను 1980లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. బందిపోట్ల బెడదతో అట్టుడికి పోతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు తనకు తానుగా కాలపరిమితిని విధించుకున్నారు. కఠిన చట్టాలతో బందిపోట్లను ఏరిపారేశారు. అయితే.. ఈ ఏరివేతలో ఆయన పలువిమర్శలు సైతం ఎదుర్కొన్నారు. ఫలితంగా ఆయన సోదురుడుని కోల్పోయారు. దీంతో మనస్థాపం చెందిన సింగ్.. తన పదవికి రాజీనామా చేశారు. నిజాయితీకి దక్కిన గుర్తింపు ఈ కాలక్రమంలో వీపీసింగ్‌లోని నిజాయితీ, కార్యదక్షతలను ఇందిరాగాంధీ గుర్తించారు. వెంటనే ఆయనకు కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించారు. రాజీవ్‌గాంధీ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆయన మంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత పన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపిన వైనం భారత చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఫలితంగా ఆయన హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్టంగా రూపుదిద్దుకుంది. |