సింగ్ అనుసరించిన నిష్పక్షపాత వైఖరి, నిక్కచ్చితత్త్వం వల్ల పారిశ్రామికవర్గాల నుంచి ఒత్తిడికి తలొగ్గిన ప్రధాని రాజీవ్ గాంధీ.. ఆయన్ను రక్షణ శాఖ మంత్రిగా నియమించారు. వీరిద్దరి మధ్య భోఫోర్స్ కుంభకోణం విడదీసింది. ఫలితంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత జనమోర్చా.. 1988లో అలహాబాద్ చారిత్రాత్మక ఉప ఎన్నిక.. జనతాదళ్.. ప్రధానమంత్రి.. ఇలా అంచలంచెలుగా వీపీసింగ్ ఎదిగారు. తాను ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని నిర్ణయించినపుడు దానివల్ల కలిగే పర్యావసానాలను ఆయన ముందుగా ఊహించలేక పోయారు. అంతేకాకుండా తన ప్రభుత్వం గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో కూడా పదవిని కాపాడుకునేందుకు అడ్డదారులు తొక్కలేదు. ముఖ్యంగా నాడు అద్వానీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ఉంటే ఆయన ప్రభుత్వం కొనసాగేదే. మతోన్మాదాన్ని బహిరంగంగా ప్రోత్సహిస్తూ విషం గక్కుతున్న భాజపాతో చెలిమి లౌకిక వాదానికే గొడ్డలి పెట్టని సింగ్ భావించి, తన పదవిని త్యాగం చేశారు. లౌకివాదం, సామాజిక న్యాయం కలబోసి రూపుదిద్దుకున్న ఆయన సిద్ధాంతాన్ని, త్యాగనిరతిని యావత్ ప్రపంచం ప్రశంసించింది. కొన్ని అనివార్య పరిస్థితుల్లో 1996 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వడాన్ని పలువురు పచ్చి అవకాశ వాదిగా ముద్రవేశారు. 1987-88 మధ్యకాలంలో సింగ్‌ను స్వామి ద్రోహిగా చిత్రీకరించారు. విమర్శలకు ఏ రాజకీయ నేత అతీతులు కాదు. అలాగే.. వీపీ.సింగ్ కూడా. అయితే ఆయన వ్యక్తిత్వంలో కొన్ని పార్శ్వాలు మాత్రం నేటికీ నిగూఢంగానే మిగిలి పోయాయి. ఇలా దేశ చరిత్ర పుటల్లో తనకంటూ ఒక పేజీని ముద్రించుకున్న వీపీ సింగ్.. గత నెల 27వ తేదీన కన్నుమూశారు. ఆయనకు 77 సంవత్సరాలు. 1931 జూన్ 25వ తేదీన జన్మించిన సింగ్.. 1977 నుంచి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ.. తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సీతాకుమారి, కుమారులు అజేయ సింగ్, అభేయ సింగ్‌లు ఉన్నారు. 'రాజా ఆఫ్ ముండా'గా ప్రసిద్ధుడైన సింగ్.. దేశ ప్రధానిగా 1989 డిసెంబరు రెండో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. 1990 నవంబరు పదో తేదీ వరకు పదవిలో కొనసాగారు. |