పంచమ వేదముగా పరిగణించబడే మహాభారతము భారత ఇతిహాసముల్లో ఒకటి. ఈ మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యముగా పేరొందిన మహాభారత రచనలోనూ ఆదిమూలమైన విఘ్నేశ్వరుని పాత్ర ఎనలేనిదని పురణాలు పేర్కొంటున్నాయి. వేదాలను విభజించిన వేదవ్యాసుడు పంచమవేదమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించి, వ్రాయగల సమర్ధునికోసం గణపతిని ప్రార్ధించాడు.
వేద వ్యాసుని ప్రార్థనకు మెచ్చి గణనాథుడు తానే మహాభారత రచనకు పూనుకున్నాడు. అయితే గణపతి ఒక నియమాన్ని విధించాడు. వ్యాస మహర్షి కావ్యసారాంశాన్ని ఎక్కడా ఆపకుండా చెప్పాలని పేర్కొన్నాడు. దీనికి అంగీకరించిన వ్యాసుడు కూడా ఒక నియమం విధించాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ నియమం ఏమిటంటే...? తాను చెప్పినదానిని పూర్తిగా అర్ధం చేసుకొనే గణపతి వ్రాయాలన్నదే... అలా కుదిరిన ఒప్పందం ప్రకారం భారత కథా రచన సాగింది. ఇంకా చెప్పాలంటే గణేశ్వరుడు తన దంతాన్నే ఘంటంగా వినియోగించినట్లు ప్రతీతి.
అంతటి మహానుభావుల సమర్పణ గనుకనే మహాభారతం అనన్య మహాకావ్యమైనదని చెప్పడంలో ఎలాంటి సంశయము లేదు. సంస్కృతము మాతృక అయిన ఈ మహా కావ్యాన్ని, తెలుగులోకి కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు అనువదించిన సంగతి విదితమే.
|