అందుకే... “ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము”... అంటూ ఎలుగెత్తి కీర్తించిన రాయప్రోలు సుబ్బారావుగారి ప్రబోధాన్ని మరోసారి మననం చేసుకుని దేశ విదేశాల్లో సైతం స్వాతంత్ర్య దినోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించుకోవడం భారతీయులుగా మనందరి కర్తవ్యం.
ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన వచ్చే ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇచ్చే సెలవు దినం కోసం ఎదురుచూపులు చూడటం కాకుండా, స్వాతంత్ర్య దినం కోసం ఎదురుచూడటం భారతీయులందరి కనీస ధర్మం. మరణించిన పెద్దలను ప్రతి ఏటా స్మరించుకోవటం, సంతర్పణలు లాంటివి చేస్తుంటాం.
మరి మనందరం స్వేచ్ఛగా బ్రతికేందుకు మరణం తప్ప మరో మార్గం లేదని తెలిసి కూడా కదనరంగంలోకి దూకి అసువులు బాసిన స్వాంతంత్ర్యోద్యమ వీరులను ఒక్కరోజైనా తలచుకోవటం మన కనీస ధర్మం కాదా..? మనం వారికి ఎలాంటి సంతర్పణలు చేయాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా ఒక్కసారి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటే చాలు.
మన ముందు తరాలవారి త్యాగ ఫలాలను భోంచేస్తున్న మనం ఇప్పుడు కొత్తగా త్యాగాలు చేయాల్సిన అవసరమేమీ లేదుగానీ.. ప్రతియేటా ఈ పండుగను జరుపుకునేందుకు కాస్తంత తీరిక చేసుకుంటే చాలు.
మన భారతీయ పండుగల్లో ఏ పండుగకూ, ఏ వేడుకకీ.. ఈ స్వాంతంత్ర్య దినోత్సవ పండుగ తీసిపోదు. దసరా, దీపావళి, హోలీ, క్రిస్‌మస్ పండుగలు వివిధ మతాలకు చెందినవైతే... అన్ని మతాలవారు చేసుకోదగ్గ అద్వితీయ పండుగ మన "స్వాంతంత్ర్య దినోత్సవం".