సంవత్సరాది మన భవితకు సూచిక. అందువల్లనే తిథి, వార, నక్షత్ర యోగ, కరణాలను తెలిసే నూతన వత్సర పంచాంగమును ఉగాది పర్వదినమున అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నూతన వత్సర పంచాంగము నిర్ధేశిస్తున్న తమ జన్మఫలాలను అవలోకించి తమ భవిష్యత్ ప్రణాళికను సముచిత రీతిలో తయారు చేసుకుంటారు. అందువలన భవిష్య జీవనంలో ఎదురయ్యే పెక్కు ఇబ్బందులను సుళువుగా సంభాళించుకొనగలుగుతారు.
సంవత్సరాది పర్వదినాన నిర్వర్తించవలసినవిగా పలు ధర్మాలు చెప్పబడినవి. వాటిలో తైలాభ్యంగ సంకల్పం, మండప నిర్మాణం, నూతన వత్సదేవాతారాధన, నింబకుసుమ రసాయన భక్షణం, నూతన పంచాంగ శ్రవణం, కళాగోష్ఠి ముఖ్యమైనవి.
ఆరోగ్య ప్రాప్తిని అందించే 'వేపపూత పచ్చడి'ను సేవించడం తప్పనిసరి. షడ్రుచుల కలగలుపైన ఈ మేలు మిశ్రమం దైహిక బాధలను తొలగించుటలో ఎన్నదగినది. దీనిలో కలుపబడే చింతపండు, బెల్లం, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, గసగసాలు, చెరకుముక్కలు, పచ్చిమామిడి ముక్కలు ఇత్యాదులు అత్యుష్ఠ వాతావరణం వలన కలిగిన ఇవి ఈతి బాధలను నివృత్తి చేస్తాయి.
అంతేకాక 'ఉగాది పచ్చడి' సేవనంలో అద్భుతమైన పరమార్థం కూడియున్నది. రానున్న వత్సరంలో తీపి, పులుపు, చేదు తదితరములతో పోల్చదగిన అనుభవాలను సమదృష్టిలో స్వీకరించే, పటుతర శక్తిని అలవరచుకోవాలనేదే అందలి సంత్సందేశము. వసంత ఋతువులో ఉదయించే ఉగాది లావణ్యతకు చిహ్నం. అందుచేతనే ఉగాది పర్వదినము నుండి శ్రీ రామనవమి వరకు వసంత నవరాత్రులు నిర్వహించి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నెరపుట తెలుగువారి సాంప్రదాయం.
|