ఈ సృష్టిలో అపురూపమైనది స్త్రీ... ఆమెకు మాతృత్వం అందించే అనుభూతి మరపురానిది. అమ్మను కాబోతున్నానని తెలిసిన మరుక్షణం అనిర్వచనీయమైన ఆనందానికి చిరునామాగా నిలుస్తుంది. ప్రసవ వేదనను సైతం భరిస్తూ తన ప్రతిరూపానికి జన్మనిస్తున్న సంతోషం అమ్మతనపు సౌభాగ్యానికి అద్దం పడుతుంది. జీవితంలోని మరే ఘట్టం కూడా మాతృత్వం తాలూకు మధురిమను పంచదనే సత్యం నిర్వివాదాంశం.
ఇక అప్పటిదాకా తమ మధ్య తిరుగుతూ ఇంటిల్లిపాదికి ఆనందాన్ని అందిస్తున్న కుటుంబ సభ్యురాలు తల్లి కాబోతోందనే సంగతి తెలిసిన మరుక్షణం ఆ ఇంటిలో చోటు చేసుకునే హడావుడి అంతా ఇంతా కాదు. గుంభనంగా వ్యవహరించే మామగారు సైతం కోడలు పిల్ల ఆరోగ్యం గురించి, వచ్చే కొత్త సభ్యుని గురించి అంతరంగంలోఆదుర్దాను కనబరుస్తుంటారు.
ఈ సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తలను పాటించాలని తల్లి, అత్తమామలు, సోదరులు, మిత్రులు పలు సలహాలు, సూచనలను ఇస్తుంటారు. అయిన వారు ప్రేమతో అందించే సలహాలు, సూచనల్లో వేటిని పాటించాలనేది పెద్ద ప్రశ్నగా నిలుస్తుంది. సలహాల్లో కొన్ని అపోహలు కూడా వినపడుతుంటాయి. గర్భం దాల్చిన అనంతరం శారీరక వ్యాయామాలు చేయడం శిశువుకు తల్లికి ప్రమాదకరమని చాలా మంది అపోహపడుతుంటారు.
శారీరక శ్రమ అధికంగా ఉండేవి కాకుండా తేలికపాటి నడక, ధ్యానం తదితర వ్యాయామాలు చేయడం ద్వారా గర్భిణి ఉత్సాహాన్ని సంతరించుకోవడంతో పాటు శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. పెడిక్యూర్, శారీరక మర్దనాలతో ప్రసవం త్వరగా జరుగుతుందనేది నిజం కాదు. దానికి దీనికి ఏ విధమైన సంబంధమూ లేదు.
అలాగే గర్భం దాల్చాక సెక్స్‌లో పాల్గొంటే నెలలు నిండకముందే ప్రసవం జరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ ముందుగా ప్రసవించడానికి సెక్స్ ఏ మాత్రం కారణం కాదు. అలాగే పై పొట్ట ముందుకు పొడుచుకు వస్తే మగపిల్లాడని, కింది పొట్ట పైకి ఉంటే ఆడపిల్ల పుడుతుందని చెప్పడం సరికాదు. ఇది కేవలం అపోహ మాత్రమే. గర్భం దాల్చిన తొలి నాళ్ల నుంచి క్రమం తప్పకుండా ఒకే వైద్యుని సమక్షంలో ఆరోగ్య పరీక్షలు, సూచనలు తీసుకోవడం ద్వారా పండటి శిశువుకు జన్మనివ్వడం నేటి కాలమాన పరిస్థితుల్లో ఉత్తమమైన పద్దతి.
|