ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గర్భిణీ స్త్రీలకు కుటుంబ సహాయం అతి ముఖ్యం
మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అంటూ ఒక పాత తరం కవి అద్భుతగీతం రాశారు. మాత్రత్వాన్ని ఆయన అనుభవించి ఉంటే ఆడజన్మ సార్థకం అనే మాట ఆయన నోటి వెంట వచ్చేది కాదని కొందరు చెణుకులు విసిరారనుకోండి. కాని సంప్రదాయ సమాజం అత్యున్నత గౌరవం ఇచ్చి ప్రశంసించిన మాతృత్వం భావన వెనుక నవమాసాల పాటు గర్భిణీ స్త్రీ మోసే ఒత్తిళ్ల భారం మాటల్లో వర్ణించలేమంటే ఎవరూ నమ్మరేమో.. కాని నమ్మకతప్పదని ఆధునిక వైద్య పరిశోధనలు ఢంకా భజాయించి మరీ ప్రకటిస్తున్నాయి.

పండంటి బిడ్డను కనే సమయంలో గర్భిణి స్త్రీలకు ఎదురవుతున్న పలు రకాల శారీకర, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవాలంటే కుటుంబం పాత్ర ఎంతగానో ఉందని తిరుచ్చిరాపల్లిలో జరిగిన ఓ వర్క్‌షాప్ తేల్చి చెప్పింది. గర్భిణీ స్త్రీలు ప్రసవించేవరకూ వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని క్రమబద్ధంగా ఉంచడానికి కుటుంబసభ్యుల పాత్ర కీలకమైనదని 'నూతన శిశువు ఆరోగ్యం కోసం భాగస్వామ్యం' పేరిట జరిగిన ఈ వర్క్‌షాప్ తెలిపింది. నవమాసాల కాలంలో ప్రాణిని కడుపులో మోస్తున్న స్త్రీకి ఇచ్చే వైద్య సహాయం కంటే ఆమె కుటుంబసభ్యులకు వైద్యుల కౌన్సిలింగ్ చాలా అవసరమని వర్క్‌షాప్‌లో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు

బుధవారం భారతీయ వైద్య మండలి తిరుచ్చిరాపల్లి శాఖ, మరియు అఖిల తమిళ ప్రసూతి వైద్యుల సమితి సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించిన భారత వైద్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్ మోహన్‌దాసు ఈ పథకాన్ని గ్రామీణప్రాంతాలకు కూడా విస్తరించనున్నట్లుగా తెలిపారు. గర్భిణీ స్త్రీలకు మరియు కుటుంబ సభ్యులకు ప్రసవవూర్వ కౌన్సిలింగ్‌ను అందించడానికి వైద్యబృందాలు మారుమూల గ్రామాలకు సైతం పంపించనున్నామని చెప్పారు.

తిరుచ్చిరాపల్లి వైద్య కళాశాల డీన్ పి. రవిశంకర్ మాట్లాడుతూ... శిశుమరణాలను మరియు ప్రసవకాల మరణాలను అరికట్టాలంటే, గర్భధారణ సమయంలో స్త్రీలను వైద్యపరమైన అంశాలలో చైతన్యపర్చే ప్రక్రియను దీర్ఘకాలం కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అఖిల తమిళ ప్రసూతి వైద్యుల సమితి గౌరవ కార్యదర్శి జయమ్ కన్నన్ మాట్లాడుతూ గర్భం ధరించిన తొలి నెలనుంచే మహిళలు వైద్య సలహాలను స్వీకరించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రధానంగా కుటుంబంపైనే ఉందని తెలిపారు. ప్రసూతి సమయంలో మరణాలను నిరోధించాలంటే సంస్థాగతంగా వైద్యశాలల్లో ప్రసవాలు జరిపించడమే ఆరోగ్యకరమైన సూచన ఆమె పేర్కొన్నారు.

అయితే కుటుంబాలు సంతానంపై పెంచుకుంటున్న అంచనాలు గర్భిణీ స్త్రీలపై ఒత్తిడిని బాగా పెంచుతున్నాయని ఆమె తెలిపారు. దేశంలో శిశు, ప్రసూతి మరణాల రేట్లు తగ్గుతున్నాయి కాని అదే సమయంలో గర్భధారణ పట్ల నగరప్రాంతాల్లో సైతం ఈ నాటికీ అనేక భ్రమలు వ్యాప్తిలో ఉన్నాయని ఆమె చెప్పారు.

సురక్షిత కుటుంబ నియంత్రణ పధ్ధతులు మరియు పిల్లలకు తల్లిపాలు మాత్రమే పట్టడం అనేవి ఈ ప్రాజెక్ట్ కీలకాంశాలుగా వర్క్‌షాప్ ప్రకటించింది.
మరిన్ని
సృష్టికే అపురూపం అమ్మతనం
గర్భిణీలకు వ్యాయామం తప్పనిసరి
ముస్లిం మహిళలకు వక్ఫ్‌బోర్డు అండ
మహిళల హక్కల సంరక్షణే ఇస్లాం లక్ష్యం: మధాని
ఆకాశాన్ని అంటుతున్న కేశ సౌందర్య ఖర్చులు
మగవారూ... స్త్రీల ముందు అబద్దాలు చెల్లవండీ...