నాజూకు మహిళలతో పోలిస్తే, లావుపాటి మహిళల ఆకలిని వ్యాయామం తగ్గించలేదని తాజా పరిశోధనల్లో తేలింది. మహిళల ఊబకాయానికి వ్యాయామానికి మధ్య సంబంధాన్ని గురించి మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకులు ప్రయోగాలు చేశారు. ఆకలిని తగ్గించలేక పోవడం అనే ఈ లక్షణం వల్ల ఊబకాయపు మహిళలు వ్యాయామం తర్వాత మరింత ఆహారాన్ని ఆబగా తీసుకునే ప్రమాదముందని మిచిగాన్ వర్శిటీ పిహెచ్‌డి స్కాలర్ కాటరీనా బోరర్ చెప్పారు.
ఈ అధ్యయనానికి కాటరీనా నేతృత్వం వహించారు. ఊబకాయం కలిగిన వ్యక్తుల బరువును తగ్గించడం కోసం ఆకలిని నియంత్రించడంలో వ్యాయామానికి ఉన్న పరిమితులను అర్థం చేసుకోవడానికి సంబంధించి ఈ సమాచారం థెరపిస్ట్‌లు, వైద్యులకు చక్కగా సాయపడుతుందని కాటరీనా చెప్పారు. శరీరంలో కొవ్వు పరిమాణంలో మార్పులు ఆకలిపై, లెప్టిన్ అనే హార్మోన్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కాటరీనా బోరర్ ఆమె సహ పరిశోధకులు ప్రయత్నించారు.
శరీరంలో కొవ్వు పెరిగినప్పుడు జంతువుల్లోని లెప్టిన్ హార్మోన్ ఆకలిని నిరోధిస్తుంది. లెప్టిన్ స్థాయి పెరిగినప్పుడు అది ఆకలిని అడ్డుకుని, కేలరీలను శక్తిగా వినియోగిస్తుంది. అయితే ఊబకాయుల్లో మరింత లావుగా మారేకొద్దీ, వారి లెప్టిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది కాని ఈ హార్మోన్ చర్యలు వారిలో పనిచేయకుండా పోతాయి.
అందుకే సన్నగా ఉండే మహిళల్లో పనిచేసిన రీతిలో బొద్దుమహిళల్లో లెప్టిన్ హార్మోన్ పనిచేయదని క్యాటరీనా తెలిపారు. జాతీయ ఆరోగ్య సంస్థ నిధులతో కొనసాగించిన ఈ పరిశోధనలో క్యాటరీనా బృందం మోనోపాజ్ దశ దాటిన 20మంది మహిళలను అధ్యయనం చేశారు. వీరిలో 10 మంది ఊబకాయులు కాగా మిగిలిన 10 మంది నాజూకు మహిళలు.
రోజుకు మూడుసార్లు బరువు తగ్గించే ఆహారాన్ని తీసుకున్న ఈ మహిళలు మూడు వేర్వేరు దినాల్లో మూడు ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. ఒక ప్రయోగంలో వారు వ్యాయామం చేయలేదు. మిగిలిన రెండు ప్రయోగాల్లో మహిళలు ఉదయం, అపరాహ్న వేళల్లో ట్రేడ్‌మిల్‌పై వ్యాయామం చేశారు. వారు ఒక్కోసారి 500 కేలోరీలను వినియోగించారు. ఇలా రోజుకు వెయ్యి కేలోరీలను వీరు ఖర్చుపెట్టారు.
వ్యాయామ తీవ్రతకు సంబంధించి ఈ రెండు ప్రయోగాలు విభిన్నంగా జరిగాయి. ఒక ప్రయోగంలో తీవ్రస్థాయిలో వ్యాయామం చేశారు. 7.5 నిమిషాలపాటు 80 శాతం గరిష్ట ప్రయత్నంతో పది నడక సెషన్‌లలో పది నిమిషాల విరామ సమయంతో వ్యాయామం చేశారు. మరో ప్రయోగంలో సగం తీవ్రతతో అంటే 40 శాతం గరిష్ట ప్రయత్నంతో వ్యాయామం చేశారు. 15 నిమిషాల నడకలో 5 నిమిషాలపాటు విరామం తీసుకున్నారు.
భోజనానికి గంట ముందు, వెనుక ప్రయోగంలో పాల్గొన్నవారు తమ ఆకలి స్థాయిని నమోదు చేశారు. సాధారణ ఆకలి స్థాయిని, తీవ్రమైన ఆకలి స్థాయిని నమోదు చేశారు. హార్మోన్ కొలతల కోసం ప్రతి 15-60 నిమిషాలవ్యవధిలో వీరి రక్తనమూనాలను సేకరించారు.
ఫలితాలన విశ్లేషించి చూడగా, భోజనానికి ముందు నాజూకు మహిళల కంటే తక్కువ ఆకలి ఉన్నట్లు ఊబకాయపు మహిళలు పేర్కొన్నారు. వ్యాయామ కాలంలో ఆకలి తమలో తగ్గలేదని చెప్పారు. ఊహించినట్లుగానే నాజూకు మహిళల కంటే బొద్దు మహిళల్లో లెప్టిన్ స్థాయి అధికంగా ఉన్నట్లుగా దీన్ని బట్టి తేలిందని క్యాటరీనా బోరర్ తెలిపారు.
అయితే వ్యాయామం తీవ్రస్థాయిలో చేసినప్పుడు సన్నపాటి మహిళలతో పోలిస్తే, బొద్దుమహిళల్లో లెప్టిన్ ఉత్పత్తి తగ్గిపోలేదని ఈ అధ్యయనంలో తేలింది. తగుమాత్రం తీవ్రతతో కూడిన వ్యాయామాన్ని చేసినప్పుడే ఊబకాయపు మహిళల్లో లెప్టిన్ తగ్గిపోయింది.
దీన్ని బట్టి చూస్తే ఊబకాయపు మహిళలు తమ శరీరంలోని కెలోరీలను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలని క్యాటరీనా సూచించారు. ఎందుకంటే కొన్ని హార్మోన్ సంబంధిత సంకేతాలు సరిగా పనిచేయవు కాబట్టి కెలోరీల పరిశీలన తప్పనిసరి అని ఈ అధ్యయనంలో తేలింది. కాబట్టి వ్యాయామం ఆకలిని నిరోధిస్తుందనేది ఇకపై సందేహాస్పదంగా నిలుస్తుంది కాబోలు...
|