మన రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో దళిత వాడల్లో, లంబాడీ తాండాల్లో జీవించే అమ్మాయిల జీవితాల్లో వెలుగు రేఖలు ప్రసరించనున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే.. అనితా బాయి, మంగి బాయిలకు దళిత, లంబాడీ జీవితం అంటే ఇంతవరకు పత్తి పూలు ఏరుకోవడం, వంటచెరకు సేకరించడం, జంతువులను మేపటం, తమ కంటే చిన్నపిల్లలను ఎత్తుకు తిరగడం, వారి బాగోగులు చూడటం లాగే కొనసాగేది.
ఈ ఇద్దరు అమ్మాయిలే కాదు రాష్ట్రంలోని దాదాపు 80 లక్షల గ్రామీణ పేద కుటుంబాల్లోని పిల్లలకోసం ప్రపంచబ్యాంకు ప్రతిపాదించిన రెండు ప్రాజెక్ట్‌ల ద్వారా వారి జీవితాల్లో కొత్త మార్పుకు రంగం సిద్ధమవుతోంది.
నిరుపేదలైన దళిత తల్లిదండ్రులు గ్రామంలోని భూస్వామినుంచి తీసుకున్న రూ.10వేల రుణంకోసం 8 ఏళ్ల ప్రాయంలో ఉన్న కన్నకూతురు అనితను ఆ భూస్వామికి తాకట్టు పెట్టారు. మరోవైపున ఆరుగురితో కూడిన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకు బాల్యజీవితంలోని చిరు ఆనందాలను ఫణంగా బెట్టిన ఆదివాసి బాలిక మంగిబాయిది మరో విషాదగాధ. ఇలాంటి లక్షలాదిమంది బాలికా కార్మికులకు ఇకపై ప్రపంచబ్యాంకు ప్రాజెక్టులు స్వేచ్ఛను ప్రసాదించబోతున్నాయి.
స్వయం సహాయ బృందాల ఏర్పాటు ద్వారా వాటి సమాఖ్యల ద్వారా మహిళలకు సాధికారతను కల్పించే దశగా ప్రపంచ బ్యాంకు దారిద్ర్య నిర్మూలనా కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఈ స్వయం సహాయ బృందాల్లో చాలా భాగం బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడమే తమ ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయి.
బాలకార్మిక వ్యవస్థ సమస్యను ప్రపంచ బ్యాంకు రెండు విధాలుగా పరిష్కరించాలని యోచిస్తోంది. ఒకవేపు పేద మహిళలను స్వయం సహాయక బృందాలలో, పొదుపు కార్యక్రమాల్లో చేర్పించడం, పాత బకాయిలను తీర్చడానికి రుణసౌకర్యం కల్పించి, కొత్త జీవితాలను మొదలుపెట్టేలా చేయడం... దీంతో పిల్లలు పనిచేసి తీరవలసిన పరిస్థితులు తొలగిపోతాయి.
మరోవైపు, తమ పిల్లలను పాఠశాలకు పంపించేలా తల్లిదండ్రులను ప్రేరేపించడం కూడా ప్రపంచ బ్యాంకు లక్ష్యంలో భాగమే. ఈ లక్ష్య సాధనకోసం పిల్లలకు గురుకుల పాఠశాలలను నిర్మించి, వాటిని నిర్వహించడంలో ప్రపంచ బ్యాంకు కార్యక్రమం అన్నిరకాలుగా తోడ్పాటును అందించనుంది.
|