ప్రపంచ నాగరికతా కేంద్రంగా పేరొందిన బ్రిటన్ జనాభాలో దంపతులు మైనారిటీలో పడ్డారని తాజా అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. 2006లో ఇంగ్లండ్ మరియు వేల్స్‌లలో నమోదైన వివాహాల సంఖ్య 236,980కు పడిపోయిందని జాతీయ గణాంకాల కార్యాలయం పేర్కొంది. 1895 తర్వాత ఇంత తక్కువ స్థాయికి బ్రిటన్‌లో వివాహాలు పడిపోవటం ఇదే మొదటిసారి కావడం విశేషం.
మధ్య విక్టోరియన్ యుగంలో వివాహాల నమోదు ప్రక్రియ ప్రారంభమైనప్పటినుంచి ఇంత తక్కువ సంఖ్యలో బ్రిటన్‌లో వివాహాలు నమోదుకావడం ఇదే తొలిసారి. పెళ్లి చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ప్రజల సంఖ్య బ్రిటన్‌లో పెరుగుతున్నప్పటికీ, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే వారి సంఖ్య మాత్రం బాగా పడిపోతోంది. దేశంలో పెళ్లిళ్లు, విడాకులకు సంబంధించిన ధోరణులను గమనిస్తే పెళ్లి చేసుకుంటున్న వారి సంఖ్య పడిపోవడం క్రమం తప్పకుండా కొనసాగుతోందని తెలుస్తోంది.
అయితే సహజీవనం.. లేదంటే విడాకులు... ఇటీవలి సంవత్సరాల్లో విడాకులు తీసుకునేవారి సంఖ్య బాగా పెరిగిపోతోందని, అదే సమయంలో వైవాహిక జీవితంతో సంబంధం లేకుండా సహజీవనం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందని సర్వే తెలిపింది. దీని ఫలితంగా బ్రిటన్‌లో 16 సంవత్సరాలకు మించి వయస్సు ఉన్నవారిలో ఎక్కువమంది ఒంటరి జీవనం గడిపేవారుగా, విడాకులు తీసుకున్నవారుగా, విధవలుగా ఉంటున్నారు.
2005 గణాంకాలను పరిశీలిస్తే ఇంగ్లాండ్, వేల్స్‌లలో వివాహితులైన వారి జనాభా 50.3 శాతానికి పడిపోయింది. 1997 నుంచి వివాహం చేసుకున్న దంపతుల సంఖ్య క్రమక్రమంగా పడిపోతూ వచ్చింది. కాగా, 2006 నాటికి బ్రిటన్ జనాభాలో వివాహితుల సంఖ్య సగానికి పడిపోయింది. | | పాశ్చాత్య సమాజం రానురాను వివాహబంధానికి కట్టుబడేందుకు బదులు, పెళ్లితంతు లేని సహజీవనానికి, అదీ కుదరకపోతే ఒంటరి జీవనానికి అలవాటు పడబోతోందని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. |
| |
1995లో వివాహిత దంపతుల సంఖ్య మొత్తం జనాభాలో 56 శాతం ఉన్నప్పటికీ వివాహితుల సంఖ్య ప్రతిసంవత్సరం 100,000నుంచి 150,000 వరకు పడిపోవడం గమనార్హం. అయితే లేటు వయస్సులో పెళ్లి చేసుకోవడంలో భాగంగా ఈ పరిణామం చోటు చేసుకుందట. వైవాహిక స్థితికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, జనాభాలో వివాహితుల నిష్పత్తి పడిపోతున్నప్పటికీ గణనీయ సంఖ్యలో ప్రజలు పెళ్లికి సిద్ధపడుతున్నారని ఈ నివేదిక తెలిపింది.
విడికుటుంబాల అదృశ్యం... ఈ గణాంకాలను పక్కన బెడితే.. పారిశ్రామిక విప్లవం అనంతరం యూరప్ సమాజంలో ప్రబలిపోయిన విడి -న్యూక్లియర్- కుటుంబాల సంస్కృతి బ్రిటన్‌లో పరాకాష్టకు చేరిందా అనిపించేలా బ్రిటన్‌లో దంపతులు మైనారిటీలుగా మారిపోవడం ఆశ్చర్యం గొల్పుతోంది.
అయితే భౌతికసంపదలు పెరిగే కొద్దీ పెట్టుబడిదారీ సమాజం లైంగిక సంబంధాలను పూర్తిగా సరళతరం చేస్తుందని 150 ఏళ్ల క్రితం ఇదే బ్రిటన్‌లో కారల్‌మార్క్స్ ఊహించిన భవిష్యద్దర్శనం ఇంతకాలం తర్వాత బ్రిటన్‌లో నిరూపితమవుతోందేమో మరి.
పాశ్చాత్య సమాజం రానురాను వివాహబంధానికి కట్టుబడేందుకు బదులు, పెళ్లితంతు లేని సహజీవనానికి, అదీ కుదరకపోతే ఒంటరి జీవనానికి అలవాటు పడబోతోందని సామాజిక శాస్త్రవేత్తలు చేస్తూ వస్తున్న వ్యాఖ్యలను ఈ పరిణామాలు నిజం చేయడం లేదూ?.....
|