'ముదితల్ నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పింపగన్' అని గతంలో ఓ కవి రాసిన పద్య సారాంశాన్ని నేటికాలం మహిళలు చక్కగా అమలు పరుస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సమాజ గమనంలో తమ అవసరాలను తెలుసుకోవడంలో, ఇతరుల అనుభవాలనుంచి నేర్చుకోవడంలో పురుషుల కంటే మహిళలే చొరవను, ఆసక్తిని అధికంగా ప్రదర్శిస్తున్నారని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. వ్యాపార సమాచారాన్ని పంచుకోవడంలో, తోటి సహచరులు, అధికారులనుంచి విషయాలను రాబట్టడంలో మహిళలు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారని ఈ అధ్యయనాలను బట్టి తెలుస్తోంది.
పురుషులతో పోలిస్తే బిజినెస్ కమ్యూనికేషన్‌లో మహిళలే మిన్న అని మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ఓ తాజా అధ్యయనం తెలిపింది. ఆర్థిక, వ్యాపార వ్యవహారాల్లో సహాయ సహకారాలు అవసరమని భావించినప్పుడు పురుషులకంటే స్త్రీలే తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పాటు ఇతర వ్యాపార యజమానులు, భాగస్వాములతో చర్చించి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారని వెస్ట్‌ప్యాక్ సంస్థ చేసిన అధ్యయనం సూచిస్తోంది.
తమ వ్యాపార సహచరుల అనుభవాల నుంచి నేర్చుకునేందుకు వ్యాపార మహిళలు దాపరిరం లేనితనంతో వ్యవహరిస్తుండగా, పురుషులు సలహా తీసుకోవడంలో స్వతంత్రం వైఖరిని చేపడుతుంటారని ఈ అధ్యయనం చెప్పింది. మహిళలు తమ అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి మహిళలే ఎక్కువ సంసిద్ధత చూపుతుంటారని, పురుషులతో పోలిస్తే వీరు వ్యవస్థలు లేదా ప్రక్రియలపై వీరు ఎక్కువగా ఆధారపడరని వెస్ట్‌పాక్స్ మహిళా మార్కెట్ల విభాగం అధిపతి లార్కే రైమర్ చెప్పారు.
సాంప్రదాయ రంగాలైన అకౌటెంట్లు, స్వతంత్ర ఆర్థిక సలహాదార్లు వంటి వారు చిన్న తరహా వ్యాపారాలను నడపడంలో ఇప్పటికీ బలమైన సమాచార వనరుగా ఉంటున్నారని రైమర్ అభిప్రాయపడ్డారు. జిఎస్టీ మరియు పన్నుల వ్యవహారాల్లో ఇది మరీ స్పష్టంగా కనిపిస్తుందని ఆమె చెప్పారు.
ఇలాంటి సాధారణ రంగాల్లో స్త్రీపురుషులు సమాన స్థాయిలో ఉంటున్నారని అయితే వ్యాపార యజమానులు లేదా భాగస్వాముల నుంచి సలహాలను పొందవలసి వచ్చినప్పుడు మాత్రం 37 శాతం మహిళలు ఇతరుల అనుభవాలను ఉపయోగించుకుంటూండగా, కేవలం 6 శాతం మంది పురుషులు మాత్రమే ఇందుకు సిద్ధపడుతున్నారని రైమర్ చెప్పారు.
పోతే కుటుంబం లేదా స్నేహితుల నుంచి సలహా కోసం సంప్రదిస్తున్న వారు మహిళల్లో 22 శాతం మేరకు ఉండగా, పురుషుల్లో 16 శాతం మంది మాత్రమే ఇందుకు పూనుకుంటున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. కాగా, పాతిక వంతు మహిళలు సలహా సంప్రదింపుల కోసం తమ బ్యాంకు మేనేజర్ లేదా బ్యాంకులోని ఇతర సహచరులను సంప్రదిస్తున్నారని రైమర్ చెప్పారు.
సహాయ నెట్‌వర్క్‌ల మద్దతును పెంచుకోవడంలో పురుషుల కంటే మహిళలు సమర్థంగా ఉంటున్నారని, ప్రత్యేకించి వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఇతరుల అనుభవాలను తెలుసుకోవడానికి మహిళలు ఆసక్తి ప్రదర్శిస్తుంటారని లార్కే రైమర్ చెప్పారు.
|