టీవీని మరీ అతిగా చూస్తే అలసి పోవడమే కాదు ఊబకాయం కూడా పెరుగుతుందని తాజా అధ్యయనం తెలుపుతోంది. 'కూర్చునే వైఖరి మరియు ఊబకాయం' అనే పేరుతో కెనడియన్ కమ్యూనిటీ హెల్త్ నిర్వహించిన ఈ సర్వే.. టెలివిజన్‌ను చూస్తూ గంటల కొద్దీ గడపడానికి, ఊబకాయం పెంచుకోవడానికి మధ్య బలమైన సంబంధం ఉందని కనుగొంది.
2007లో చేసిన ఈ సర్వేకి గాను 20 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 42,600 మంది స్త్రీ, పురుషులను ఎంచుకున్నారు. స్త్రీపురుషులు ఇరువురిలోనూ ఊబకాయం పెరగడానికి టీవీని చూడడంలో సమయాన్ని అధికంగా గడపడం కూడా కారణమవుతోందని ఈ సర్వే చెప్పింది.
వయస్సు, వైవాహిక స్థితి, విద్య, గృహ ఆదాయం, వలస స్థితి, నగర-గ్రామీణ నివాసం వంటి పలు అంశాలను ఈ సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు. వారానికి అయిదు గంటల కంటే తక్కువగా టీవీ ముందు కూర్చుంటున్న వారితో పోలిస్తే, వారానికి 21 గంటలు లేదా అంత కంటె ఎక్కువ సమయాన్ని టీవీ చూసేందుకు వెచ్చిస్తున్న వారిలో ఊబకాయం మరీ ఎక్కువగా ఉంటోందని సర్వే తేల్చింది. | | అతిగా తినేవారు, అతిగా నిద్రపోయేవారు, అతిగా సుఖపడేవారు మాత్రమే ప్రపంచంలో ఊబకాయం బారిన పడుతున్నారని ఇంతవరకూ భావించేవాళ్లం. కాని ఇకపై టీవీ చూడ్డంపై కూడా మనం ఓ కన్నేసి ఉంచాలని ఈ టీవీతో ఊబకాయం హెచ్చరిస్తోంది మరి... |
| |
అలాగే కంప్యూటర్‌పై కూడా ఎక్కువ సమయం గడిపే స్త్రీపురుషులు ఇరువురిలో ఊబకాయం పెరుగుతోందని ఈ సర్వే పేర్కొంది. వారానికి 11 లేదా అంతకంటే ఎక్కువ గంటలు కంప్యూటర్ ముందు కూర్చునేవారు వారానికి 5 గంటలు లేదా అంతకంటే తక్కువ సేపు కంప్యూటర్‌పై గడిపేవారితో పోలిస్తే ఊబకాయాన్ని తమకు తాముగా ఆహ్వానిస్తున్నారని ఈ అధ్యయనం గమనించింది.
చివరకు రిలాక్స్ అవుదామని కంప్యూటర్ ముందు కూర్చున్న వారిలో కూడా ఊబకాయం పెరుగుతోందని ఈ అధ్యయనం తేల్చింది. లావు కావడానికి వయస్సు, సామాజిక, జనాభా సంబంధిత లక్షణాలను కూడా ఈ అధ్యయనం పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, వారానికి కనీసం 6 గంటలు కంప్యూటర్ ఉపయోగించేవారే ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారని కనుగొన్నారు.
అయితే, టీవీ, కంప్యూటర్లముందు కూర్చునే వారిని మినహాయిస్తే, ఎక్కువసేపు చదివేవారు, లేదా కూర్చుని పనులు చేసేవారిలో ఊబకాయం పెరగలేదని అధ్యయనం కనిపెట్టడం ఆశ్చర్యకరం.
|