ప్రపంచవ్యాప్తంగా మహిళలపై కొనసాగుతున్న అత్యాచారాలను ఇకపై సహించేది లేదని హాలీవుడ్ ప్రముఖ సినీనటి, సామాజిక కార్యకర్త చార్లీ థెరాన్ హెచ్చరించారు. ఐక్యరాజ్య సమితి శాంతిదూతగా ఈ వారంలో బాధ్యతలు చేపట్టిన థెరాన్ స్త్రీలపై హింసను అంతమొందించే విషయంపై తాను దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పారు.దక్షిణాఫ్రికాలో ప్రతి 28 సెకనులకు ఎవరో ఒక స్త్రీపై అత్యాచారం జరుగుతోందని ఈ సందర్భంగా థెరాన్ తెలిపారు. ఈ దేశంలోని ప్రతి ముగ్గురు మహిళలలో ఒకరు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అత్యాచారానికి గురైనవారేనని చార్రీ చెప్పారు. దక్షిణాఫ్రికా అకాడమీ అవార్డును పొందిన చార్లీ థెరాన్ దిగ్భ్రాంతి కలిగించే ఈ వాస్తవాలను బయటపెట్టారు. స్త్రీలపై కొనసాగుతున్న ఈ హింసా దౌర్జన్యాలను ఇంకా సహించేది లేదనే సందేశాన్ని ప్రపంచం నలుమూలలకూ బలంగా తీసుకుపోవడానికి కృషి చేస్తానని థెర్లాన్ చెప్పారు. కాగా చార్లీని ఈ కార్యక్రమంలో ఆహూతులకు పరిచయం చేసిన ఐక్యరాజ్య సమితి ఉప ప్రధాన కార్యదర్శి ఆశా రోజ్ మిగిరో మాట్లాడుతూ గత నెలలో సోమాలియాలో 13 ఏళ్ల బాలికను రాళ్లతో కొట్టి చంపేసిన దారుణమైన ఉదంతాన్ని వివరించారు. ప్రపంచమంతటా ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. |