ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > మాకు ముద్దులు కావాల్సిందే... ఆస్ట్రియా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మాకు ముద్దులు కావాల్సిందే... ఆస్ట్రియా
పాఠశాలలో ముద్దులు అనుమతించరాదని ఓ స్కూలు హెడ్మాస్టర్ తీసుకున్న నిర్ణయం ఆస్ట్రియాలో కలకలం రేపింది. ఈ వివాదం పత్రికలలో మొదటి పేజీల్లో రావడంతో అందరూ ఆ ప్రధానోపాధ్యాయుడిపై ధ్వజమెత్తుతున్నారు. దేశ రాజకీయ నేతలు, చివరకు విద్యార్థులు కూడా ఆ హెడ్మాస్టర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని వార్తలు. మరీ ఇంత కాలం పాతకాలపు చింతకాయ పచ్చడిగా ఉంటే ఎలా అని హేళన చేస్తున్నారు.

సంచలనం రేపిన ఈ వివాదానికి కారణం ఆ స్కూలులో విద్యార్థినులు పోటీలుపడి మరీ ముద్దులు పెట్టుకుంటున్నారట. ఆస్ట్రియాలోని గున్‌స్క్రిచెన్ ప్రాంతంలోని ఓ స్కూలు ప్రధానోపాధ్యాయుడు సీగ్‌ఫ్రెడ్ బీర్‌మెయిర్ ఈ వివాదానికి తెరతీసి తర్వాత ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ స్కూల్లో కొంతమంది విద్యార్థినులు శృతిమించి ముద్దులు పెట్టుకుంటున్నారని టీచర్లు ఫిర్యాదు చేయడంతో తనవంతుగా ఈయన స్కూల్లో ముద్దులపై నిషేధం విధిస్తున్నట్లుగా తల్లిదండ్రులకు లేఖ రాసి పంపించారు.

ఆస్ట్రియా సమాజ సంప్రదాయం ప్రకారం బుగ్గలపై అంటీ అంటనట్లుగా ముద్దాడటానికి బదులుగా 14 ఏళ్ల వయసు దాటని ఆడపిల్లలు తోటి విద్యార్థినుల పెదవులపై ముద్దుల మీద ముద్దులు పెట్టుకుని గాఢ చుంబనాల్లోకి దిగుతున్నారని పరస్పరం కౌగిలింతల్లో పారవశ్యం చెందుతున్నారని ప్రధానోపాధ్యాయులు ఆ లేఖలో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.

ఒక్కోసారి ఈ పిల్లలు పెదవులపై ముద్దులను నిమిషాల పాటు వదలకుండా పెట్టుకుంటున్నారని, ఇలాంటివి అవాంఛనీయ పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది కనుక టీచర్లు, తల్లిదండ్రుల ఏకగ్రీవ అనుమతితో ఆయన పిల్లల ముద్దులపై నిషేధం ప్రకటించారు.

ఇలాగే ముద్దులను కొనసాగిస్తే విద్యార్ధులు తమకు కూడా ముద్దులు పెట్టమని బాలికల వెంటపడే ప్రమాదముందని ఆ స్కూలు హెడ్మాస్టర్ భీతిల్లి, టీచర్లు, పేరెంట్ల సమావేశం ఏర్పర్చి ముద్దులపై నిషేధానికి ఏకగ్రీవ ఆమోదం వేయించుకున్నారు. దీంతో చిక్కు విడివడిందని వారు భావించారు కాని మరికాస్త ముడిపడనుందని ఊహించలేకపోయారు.

ఈ వార్త బయటకు రాగానే దుమారం బయలు దేరింది. పిల్లల నుంచే కాదు దేశ రాజకీయ నేతలనుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తమయింది. దుష్ఫలితాలకు దారితీసే ఇలాంటి నిర్ణయాలు మధ్యయుగాల భావజాలానికి అనుగుణంగా ఉంటున్నాయని వారు పెద్ద పెద్ద మాటలతో స్కూలు ప్రధానోపాధ్యాయుడిని సత్కరించారు.

స్కూలు పిల్లల ముద్దులపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయించాలని, పాఠశాలల్లో హింసాత్మక చర్యలు పెరగడం వంటి నిజమైన సమస్యలు ఎన్నో ఉంటుండగా ముద్దులపై నిషేధం వంటి కాలం చెల్లిన పద్ధతులను పట్టుకుని వేలాడటమేమిటని ఆస్ట్రియా పీపుల్స్ యూనియన్ ఓ ప్రకటనలో ధ్వజమెత్తింది.

ఈ మొత్తం ఉదంతానికి పరాకాష్టంగా నిషేధాన్ని ముద్దులతో కొడతామంటూ మరో విద్యార్థి సంస్థ ఆక్టియన్ క్రిట్సీచర్ ష్యూలర్ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. వెంటనే ముద్దులపై నిషేధాన్ని ఎత్తివేస్తే సరి.. లేదా... వచ్చే వారం పాఠశాల మంత్రి కార్యాలయం ముందు ముద్దులు పెట్టుకుని మరీ నిరసన తెలుపుతామని ముద్దుబాంబు హెచ్చరిక జారీ చేసింది.

ఆహా ఆస్ట్రియా... నిజమే... అయినా శతకోటి సమస్యల ముందు... బోడి ముద్దు సమస్యా ఒక సమస్యేనా....
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
స్త్రీలపై అత్యాచారాలను సహించేది లేదు!
"ఆడదానికి ఆడదే శత్రువు" : హెలెన్
రికార్డు స్థాయిలో మహిళా ఐఏఎస్ ట్రైనీలు
డబ్బులిస్తే మాత్రం.. బట్టలిప్పుతానేంటి!
మహిళల పురోభివృద్ధి అంటే ఇదేనా..?!
తలపాగాపై వ్యాఖ్యతో బిబిసిలో ఉద్యోగం గల్లంతు