ఇంతకాలం సేవారంగాలలో మాత్రమే తళుక్కుమంటూ మెరిసిన మహిళా ఉద్యోగులు ఇకపై ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో కూడా అత్యధికంగా కనిపించనున్నారు. టీచింగ్, బీపీఓ, బ్యాంకింగ్, నర్సింగ్ వంటి సేవా రంగాలలో తమ ప్రతిభా పాటవాలను చూపించిన మహిళలు ఈ సారి ఐఏఎస్‌లో తమ హవా చూపించారు.ముస్సోరీలోని ఐఏఎస్ శిక్షణా సంస్థలో ఈసారి ఏకంగా 32 మంది మహిళలు ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ శిక్షణను పొందుతుండటం విశేషం. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ రుద్ర గంగాధరన్ మాట్లాడుతూ తమ సంస్థ శిక్షణా తరగతులు ప్రారంభించింది మొదలు ఇంతమంది మహిళా అభ్యర్థులు ట్రైనీలుగా ఏకకాలంలో చేరడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు.ఇంతవరకు సివిల్ సర్వీసులలో మహిళలు కాస్తంత దూరంగానే ఉంటూ వచ్చారు. సివిల్ సర్వీసెస్‌లో ఎంపికైతే దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా పని చేయవలసి వస్తుందన్న భయం కారణం కావచ్చు. కానీ మహిళలు ఇప్పుడు రిస్కులు తీసుకోవడానికి ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదని గణాంకాలే తెలువుతున్నాయి. మారుమూల ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చినా సరే నిరభ్యంతరంగా వెళ్తామని మహిళలు ప్రస్తుతం సవాలుగా ముందుకు వెళుతున్న క్రమంలోనే ఐఏఎస్‌లో కూడా మహిళలు చొరవ చూపుతున్నారు. కాదేదీ కవిత కనర్హం కవితా పాదాన్ని మార్చి ఇకముందు కాదేదీ మహిళ కనర్హం అని చదువుకోవాలేమో మరి.. |