అనేక సామాజిక సూచికలు మెరుగ్గా ఉన్న శ్రీలంక దేశంలోనూ స్త్రీల పరిస్థితి, మిగతా దేశాల స్త్రీల పరిస్థితికంటే ఏ మాత్రం భిన్నంగా లేదు. లైంగికత ప్రాతిపదికగా జరిగే హింస వేదిక (జీబీవీ ఫోరమ్) చేపట్టిన సర్వేలో వెల్లడైన అంశాలు కూడా పై విషయాన్నే నిర్ధారిస్తున్నాయి.శ్రీలంక మొత్తంమీదా కనీసం 60 శాతం మహిళలు గృహ హింసకు గురవుతున్నారని, అంతేగాకుండా.. జాతి, తెగ, మతం, వర్గం లాంటి తేడాలేమీ లేకుండా సర్వత్రా గృహ హింస విస్తృతంగా అమలవుతోందని తమ పరిశీలనలో వెల్లడైందని జీబీవీ ఫోరమ్ తెలియజేసింది. అలాగే... స్త్రీల నుంచి గృహ హింసకు సంబంధించి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని జీబీవీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.అయితే.. ఈ పెరుగుదలకు కారణం స్త్రీలపై గృహ హింస పెరగటాన్ని సూచిస్తోందా లేదా చాలా సంస్థలు చేస్తున్న కృషి ఫలితంగా ఎక్కువమంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారా అన్న విషయం మాత్రం స్పష్టం కావటం లేదని జీబీవీ అభిప్రాయపడుతోంది." హింస నుంచి మహిళల విముక్తి" అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా... ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ప్రతినిధి లెనె కే క్రిస్టియన్ సేన్ మాట్లాడుతూ... లైంగికత ఆధారంగా జరిగే హింసకు వ్యతిరేకంగా శ్రీలంక కొన్ని ఉపయోగకరమైన చర్యలను చేపట్టినాగానీ, గృహ హింస ప్రధానంగా ప్రైవేటు వ్యవహారంగా మిగిలిపోతోందని, నిశ్శబ్దం మాటున కప్పబడిపోతోందని... లేదా అలాంటిదేమీ లేదని బుకాయించటం జరుగుతోందని ఆవేదనతో అన్నారు. |