పాకిస్తాన్‌లోని స్వాత్ లోయలో 17 ఏళ్ల యువతిని తాలిబన్లు కొరడాతో బహిరంగంగా చితకబాదిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు యువతి అక్రమ సంబంధం నెరపుతున్నదన్న కారణంగా వారు ఆమెకు ఈ శిక్ష విధించినట్లు సమాచారం. బురఖా ధరించి ఉన్న సదరు యువతిని ముగ్గురు తాలిబన్లు గట్టిగా పట్టుకుని బోర్లా నేలపై పడుకుపెట్టి, ఒకరు కాళ్లూ, మరొకరు తలను గట్టిగా పట్టుకోగా మూడో వ్యక్తి కొరడాతో ఆమెను విచక్షణారహితంగా చితక బాదాడు. కొట్టవద్దని ఆమె ఎంత వేడుకున్నా పట్టించుకోని తాలిబన్లు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. బాధ తాళలేక ఆ యువతి తనను చంపేయండి- లేదా కొట్టడం ఆపండి అని అర్థించినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. అక్రమ సంబంధం నెరపినందువల్లే ఆ యువతిని అలా శిక్షించినట్లు వారు పేర్కొన్నారు. ఈ ఉదంతాన్ని ఒకరు మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఇప్పుడా వీడియో క్లిప్పింగ్ పాకిస్తాన్‌లోని అన్ని టీవీ ఛానళ్లలో ప్రత్యక్షమయ్యాయి. కాగా ఈ అరాచక పర్వం ఆరు నెలల క్రితం జరిగిందని పాకిస్తాన్ జియో టీవీ తెలిపింది. |