ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వైవాహిక చట్టంపై... ఆ దేశ మహిళలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ హక్కులను హరించే ఈ చట్టానికి వ్యతిరేకంగా కాబూల్‌లో సుమారు మూడువందల మంది మహిళలు నిరసన వ్యకం చేస్తూ ఆందోళన జరిపారు.వైవాహిక అత్యాచారాన్ని చట్టబద్ధం చేయడంతో కాబూల్ శివార్లలోని ఒక మసీదు వద్ద.. ఆప్ఘన్ మహిళా హక్కుల కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే, చట్టానికి మద్దతుగా అక్కడికి చేరుకున్న సంప్రదాయవాదులు, కొంతమంది పురుషులు మహిళలపై రాళ్లు రువ్వి హింసకు తలపడ్డారు.ఇదిలా ఉంటే... గతంలోని తాలిబన్ ప్రభుత్వ పోకడలను సైతం తలదన్నే రీతిలో... ప్రస్తుత ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ పూర్తి మహిళా వ్యతిరేకమైన సరికొత్త షియా కుటుంబ చట్టాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కొత్త చట్టం ప్రకారం... షియా మతస్థుడైన భర్తకు, కనీసం వారానికి నాలుగుసార్లైనా లైంగిక వాంఛలను తీర్చాల్సిందిగా భార్యను డిమాండ్ చేసే హక్కు సంక్రమించింది.అంతేగాకుండా... ఈ తాజా షియా కుటుంబ చట్టం బాల్య వివాహాలకు సైతం ఆమోద ముద్ర వేసింది. భార్యలను నిరవధికంగా ఎంతకాలమైనా సరే ఇంట్లోనే నిర్బంధించే హక్కును కూడా భర్తలకు కట్టబెట్టింది. అలాగే ఏదేని కారణాల రీత్యా భార్యాభర్తలు విడాకులు తీసుకున్నట్లయితే... ఎలాంటి మినహాయింపులకూ తావు లేకుండా, పిల్లలు ఎప్పటికీ తండ్రికే చెందుతారని ఈ చట్టం చెబుతోంది.ఇలాంటి పూర్తి మహిళా వ్యతిరేకమైన కుటుంబ చట్టాలను నిర్దేశించిన ఆప్ఘన్ ప్రభుత్వంపై ప్రపంచమంతటా నిరసనల వెల్లువెత్తుతున్నాయి. స్త్రీలను బానిసలను చేసేందుకు, మగవాళ్లకు హక్కులు కల్పించేందుకోసమేనా ఈ చట్టాలున్నాయంటూ... ఆప్ఘన్ మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.కాగా... మహిళల హక్కులను కాలరాస్తున్న ఈ కుటుంబ చట్టాన్ని అమెరికా తప్పుబట్టడంతో ఆలోచనలోపడ్డ అధ్యక్షుడు కర్జాయ్.. దీనిని సమీక్షించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు చట్టాన్ని సమీక్షించాలంటూ న్యాయశాఖను ఆయన ఆదేశించారు. అయితే.. పార్లమెంటులో ఎలాంటి చర్చా లేకుండానే ఈ చట్టాన్ని ఆమోదించారని ఆప్ఘన్ మహిళా ఎంపీలు దుయ్యబడుతున్నారు. |