మగువలు ఇంటిని చక్కబెట్టడమే కాదు ఆఫీసు కార్యకలాపాలను చక్కబెట్టే సమర్థులుగా నిరూపించుకుంటున్నారు. మహిళల పనితనాన్ని పురుషులతో పోల్చి చూసినప్పుడు మగవారి కంటే ధీటుగా పనిచేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ప్రెజెంటేషన్, బోర్డ్ మీటింగ్స్, సేల్స్, వివిధ రంగాలలో మహిళలే ముందుంటున్నారంటున్నాయి తాజాగా జరిపిన సర్వేలు. దేశంలోని పలు పెద్ద కంపెనీలు ఆయా కంపెనీలకు వస్తున్న లాభాలు, పెట్టుబడులు, అమ్మకాల ఆధారంగా నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. విజయాన్ని అందుకున్న మహిళలు మరింతగా దూసుకుపోతున్నారని నిపుణులు అంటున్నారు.వెయ్యిమంది మహిళల మీద సర్వే చేసిన నిర్వాహకులు ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళా సారధ్యం వహిస్తున్న కంపెనీలన్నీ ఇప్పుడు ముందంజలో ఉన్నాయి.ఒక సంస్థలో కీలక నిర్ణయాలు తీసుకునే స్థానంలో కనీసం ఇద్దరు మహిళా డైరెక్టర్లు ఉన్న కంపెనీలు ఆర్ధికంగా నిల దొక్కుకుంటున్నాయని ఆ సర్వేలు చెపుతున్నాయి. పరిస్థితులను ఎదుర్కోగల ధైర్యం, మార్కెట్ పరిస్థితులను సమన్వయ పరుచుకోవడం, స్థిరత్వం, సహనం వీరిలో ఎక్కువగా ఉన్నందునే మహిళల నాయకత్వంలో ఉండే కంపెనీలు ఆయా కంపెనీలకు మంచి ఫలితాలు సాధించేలా చేస్తున్నాయని సర్వే నిపుణులు అంటున్నారు. ఇవి కంపెనీ అభివృద్ధికి మరింత తోడ్పడుతున్నాయి.మహిళలు ఏ నిర్ణయం తీసుకున్నా నిలకడగా ఉంటారు, పైగా మహిళామణులు పురుషుల మాదిరిగా ఎక్కడ జీతం ఎక్కువ ఇస్తుంటే అక్కడికి తరలిపోరు. మహిళలు త్వరగా ఇతర కంపెనీలకు మారకపోవడంతో మల్టీనేషనల్ కంపెనీల్లో మహిళల శాతం రోజురోజుకి పెరుగుతుంది. ఇదిలావుండగా మహిళలు ఓవర్ టైం చేయరనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పటి మహిళ తన దృష్టినంతా కెరీర్‌మీదే నిలుపుతున్నారు. నైట్‌షిప్టులని, ఓవర్‌టైంలని చేయడానికి కూడా వారు వెనుకాడటం లేదు. ఈ విషయాన్ని గమనిస్తే దీనివల్ల కంపెనీకి వచ్చే ఆదాయం నలభై శాతం పెరుగుతోంది. పలు కారణాల దృష్ట్యా ఎగ్జిక్యూటివ్స్‌గా మహిళల నియామకం రోజు రోజుకు పెరుగుతోందని సర్వేలు చెపుతున్నాయి. |