మీ కుటుంబ వ్యవహారాలన్నిటినీ మీరే చూస్తుంటారా..? ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలన్నీ మీపైనే వేసుకున్నారా..? మీ ఆర్థిక లావాదేవీల గురించి మీ భార్యకు అస్సలు తెలియదా...? అలా అయితే చాలా తప్పు చేస్తున్నట్లే లెక్క అంటున్నారు ఆర్థిక సలహాదారులు.మీరు చాలాచోట్ల పెట్టుబడులు పెట్టి ఉంటారు. అలాగే కొందరికి అప్పుగా డబ్బు ఇచ్చి ఉండవచ్చు. పలుచోట్ల స్థిరాస్తులను కొనుగోలు చేసి ఉండవచ్చు. ఈ వివరాలన్నింటినీ మీ భాగస్వామికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలియకపోవడం వల్ల మీ కుటుంబానికి తెలియకుండానే నష్టం జరుగుతుంది. ఆమెకు చెప్పినా అర్థం కాదులే..? అని వదిలేయవద్దు. దీనికంటూ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి అన్ని విషయాలను ఆమెకు చెప్పండి. మీ పెట్టుబడుల జాబితా- అసలు మీకు ఎక్కడెక్కడ పెట్టుబడులు ఉన్నాయో ఓ జాబితా తయారు చేయండి. ఆ వివరాలను ఆమెకు పూసగుచ్చినట్లు చెప్పండి. ఒకవేళ చెప్పకూడని ఆస్తి వివరాలేమైనా ఉంటే వాటిని ప్రత్యేకించి మీ డైరీలో రాసి ఉంచండి. ఎప్పుడైనా మీరు సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆస్తి సంబంధిత సమస్యలేమైనా తలెత్తితే, మీ భాగస్వామికి వాటి పూర్వాపరాలు తెలుసు కనుక వాటిని ఆమే పరిష్కరించగలదు. సుదూర ప్రాంతంలో ఉన్న మీరు సదరు సమస్యపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీ పర్సనల్ కంప్యూటర్‌లో ఆ వివరాలను నిక్షిప్తం చేసి ఉన్నట్లయితే, యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఆమెకు తెలియజేయండి. ఇది ఎంతో గోప్యమైనదని మీ భాగస్వామితో విడమరిచి చెప్పండి. మీ బ్యాంకు ఖాతా వివరాలు- మీ బ్యాంకు ఎకౌంటు వివరాలను మీ భార్యకు ఎప్పటికప్పుడు చెపుతూ ఉండండి. ముఖ్యంగా ఇది ఎమర్జెన్సీ సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనుకోకుండా ప్రమాదాల బారినపడినప్పుడు, మీరు అందుబాటులో లేనప్పుడు మీ భార్య వ్యవహారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగల అవకాశం దీనివల్ల ఏర్పడుతుంది. అంతేకాదు... బ్యాంకు బ్యాలెన్సును బట్టి ఆమె తన ఇంటి బడ్జెట్‌ను రూపొందించుకునే అవకాశం కలుగుతుంది. మీ ఎకౌంటులో నగదు ఎంత ఉందో తెలియని స్థితిలో ఆమెను ఉంచకూడదు.తనఖాలు.. క్రెడిట్ కార్డ్ అప్పులు- మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ షేర్లు, తనఖా, క్రెడిట్ కార్డ్ అప్పులు.. ఇతర అప్పుల వివరాలన్నిటినీ ఆమెకు తెలియజేయండి. మీరు మీ పనులతో బిజీగా ఉంటారు కనుక, మీ భార్య తీరిక వేళల్లో మార్కెట్ ఎగుడుదిగుడులను గమనించి మీ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయో లేదో చూసి బేరీజు వేయగలదు. అదేవిధంగా పేరుకుపోతున్న అప్పుల నుంచి ఎలా బయటపడాలో ఆమె ఆలోచన చేసి మీకు మంచి పరిష్కార మార్గాన్ని చూపగలదు. బరువంతా ఆమెపైనే వేయకూడదు- అన్నీ చెప్పేశాను కదా... ఇక అన్నీ ఆమే చూసుకుంటుందిలే.. అని ఆమెపై అధిక భారం మోపకూడదు. ఆర్థిక లావాదేవీలను ఆమె ఎలా పరిష్కరిస్తుందో అప్పుడప్పుడు చూస్తుండాలి. మీకు బాగా ప్రయోజనాన్ని చేకూర్చేవిధంగా ఆమె నిర్ణయం తీసుకుని ఉంటే... ఆమెను అభినందించండి. ఒకవేళ నష్టానికి దారితీసే నిర్ణయమైతే.. ఎందుకు నష్టం వచ్చిందో వివరించి చెప్పండి. అంతేగానీ.. తిట్ల దండకంతో ఆమె మనసును గాయపరచకూడదు. ఇలా చేస్తే ఆమెపై ఆమెకున్న విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంటుంది. కొనుగోళ్లలో ఆమెను పాలుపంచుకోనివ్వండి- కొన్ని ఆర్థిక లావాదేవీలలో స్వయంగా పాల్గొనే అవకాశాన్నివ్వండి. ఉదాహరణకు.. మీరు ఒకచోట భూమి కొనదలచారునుకోండి. ఆ కొనుగోలు వ్యవహారంలో మీతోపాటు మీ భార్యను మాట్లాడనివ్వండి. అలాగే మీ ఆర్థిక వ్యవహారాల్లో వేటికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదీ చెప్పండి. ఇది తెలుసుకుని ఉన్నట్లయితే ఆమె ఎక్కడా పొరపాటు నిర్ణయం తీసుకునే వీలే ఉండదు. ఇంటి బడ్జెట్- ఇల్లాలిదే నిర్ణయం- అన్నిటికీ మించి మీ ఇంటి బడ్జెట్‌పై ఆమె కసరత్తు చేసిన అనంతరం, ఆ అంశాలను మీరు పరీక్షించండి. వాటిలో ప్రాధాన్యం లేనివాటిని తొలగించి.. కారణాలను మీ భాగస్వామికి తెలుపండి. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని మసలుకుంటే పురుషులు తమపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడమేకాక, వారి భాగస్వాములు ఇంటి ఆర్థిక వ్యవహారాల్లో పూర్తి అజ్ఞానంలో లేకుండా చేయవచ్చు. ఫలితంగా ఇంటి ఆర్థిక స్థితి పటిష్టతకు దోహదపడుతుంది. |