మహిళలపై రోజు రోజుకి దాడులు ప్రజ్వరిల్లుతున్నాయి. ఒకవైపు యాసిడ్ దాడులు, ఇంకోవైపు.. గృహం హింస, మరోవైపు అత్యాచారాలు.. పడగవిప్పి ఆడుతున్నాయి. ప్రతిరోజు మహిళలకు జరిగే అన్యాయాలు, అక్రమాలను నిత్యం చదువుతూనే ఉన్నాం.
కానీ.. వీటికన్నింటికీ సమాజంలో ఎవరో కొందరు కారణభూతులుగా ఉన్నారు. అయితే, దేశ రాజధానిలో ఓ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారానికి ఏకంగా రాష్ట్రపతి అంగరక్ష బృందంలోని నలుగురు సిబ్బంది కారణం కావడం శోచనీయం.
గత 2003 సవంత్సరం అక్టోబరు ఆరో తేదీన దేశ రాజధానిలోని ఒక విశ్వవిద్యాలయానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని స్నేహితురాలితో కలిసి రాష్ట్రపతి భవన్‌కు సమీపంలోని బుద్ధ జయంతి పార్కుకు సేదదీరేందుకు వెళ్లింది. ఆ సమయంలో రాష్ట్రపతి అంగరక్షకుల బృందంలోని నలుగురు ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ కేసులో మొత్తం నలుగురు నిందితుల్లో హరిప్రీత్ సింగ్, సత్యేందర్ సింగ్‌లు అత్యాచారానికి పాల్పడగా, కుల్దీప్ సింగ్, మనీష్ కుమార్‌లు వారికి తమ వంతు సహకారం అందిస్తూ.. కాపలాగా ఉన్నారు.
ఈ ఘోరానికి పాల్పడిన ఈ నలుగురిని ఢిల్లీలోని సిటీ కోర్టు ఒకటి సోమవారం దోషులుగా తేల్చింది. అయితే, శిక్షల ఖరారు మాత్రం.. ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై పైకోర్టులో అప్పీలు చేస్తామని నిందితుల తరపు న్యాయవాది రణబీర్ సింగ్ వెల్లడించారు.
అయితే నిందితుల్లో ఒకరైన సత్యేందర్ తాత గణపతి సింగ్ మాత్రం కోర్టు తీర్పును స్వాగతించారు. కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించడంపై తానేమీ బాధపడటం లేదని తెలిపారు. మరి ఈ నలుగురికి కోర్టు ఏ మేరకు శిక్ష విధిస్తుందో..? వేచి చూడాల్సిందే..!