నాజూకైన స్త్రీల చేతివేళ్లకు... గోళ్లు అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెడతాయి. స్త్రీలు గోళ్ల అందం కోసం వాడే రంగుల విలువ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల డాలర్లుంటుంది. అంతేకాక కొన్ని వృత్తులు చేసే వారికి గోళ్లు ఉపయోగపడతాయి. అందుకే వాళ్లు గోళ్లు పెంచుకుంటారు. నిత్య జీవితంలో కూడా గోళ్లు కొంచెం అయినా పెంచుకోకపోతే మనకి కొన్ని పనుల్లో ఇబ్బంది కలుగుతుంది. గోళ్లు మన ఆరోగ్యానికి సంకేతాలుగా కూడా పనిచేస్తాయి.
గోళ్లను గురించి మనం తెలుసుకోవలసిన, సామాన్యంగా చాలా మందికి తెలియని విషయాలు చాలా వున్నాయి. గోళ్లు అరిగిపోకుండా అందంగా కనిపించాలంటే వాటికి బలం కావాలి. జట్టులాగానే గోళ్లు కూడా కెరటిన్ ప్రొటీన్‌తో ఏర్పడతాయి. గోళ్లలో తేమ 18 శాతం ఉంటే గోళ్ల నాణ్యతకి మంచిది. గోరులో మూడు ముఖ్య భాగాలుంటాయి. 1. చివరి అంచు, 2. అసలు గోరు, 3. గోరు మొదలు. కెరటిన్ గోరు పీఠం వద్ద తయారవుతుంది. గోరుచుట్టూ వుంటే పొరను క్యూటికిల్ అంటారు. గోళ్ల ఆకారాలలో చాలా రకాలున్నాయి. ప్రధానంగా చదరం, గుండ్రం, అండాకారం, కూసుగా వుండేవి.
గోళ్ల స్వభావం ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా వుంటుంది. కొందరిలో అవి మందంగా, వేగంగా పెరగవచ్చు. లేదా పగిలి ముక్కలయ్యేవి. చీలిపోయేవి. పొరలు పొరలుగా వూడిపోయేవి కావచ్చు. గోరు నెలకి సుమారు 2 సెంటీమీటర్లు పొడవు పెరుగుతుంది. శీతాకాలంలో కన్నా వేసవిలో ఎక్కువ వేగంగా పెరుగుతుంది. మధ్య వేలు గోరు అన్నింటికన్నా వేగంగా పెరుగుతుంది. బొటనవేలు గోరు అతి నెమ్మదిగా పెరుగుతుంది. కాలి వేళ్ల గోళ్లు చేతి గోళ్ల కన్నా మందంగా, గట్టిగా వుంటాయి. ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. గర్భవతుల గోళ్లు ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల ఎక్కువ వేగంగా పెరుగుతాయి. గోళ్లని ఎప్పుడూ తవ్వడానికి, గిచ్చడానికి ఉపయోగించకూడదు. గోల్లను ఎప్పుడూ పూర్తిగా తెంచివేయకూడదు. మరీ ఎక్కువ పొడవుగా పెంచకూడదు. వేలు కొస వరకు పెరిగితే చాలు.
|