ప్రపంచీకరణ ప్రభావంతో పెరిగిన ఉపాధి అవకాశాలతో సామాన్యుల కనీస ఆదాయం పెరిగింది. దీంతో స్వీయ సౌందర్యం పట్ల సామాన్యులలో ప్రత్యేక శ్రద్ధ చోటు చేసుకుంది. కేవలం సినీతారలకు, మోడళ్లకు మాత్రమే పరిమితమైన కాస్మోటిక్ సర్జరీ పట్ల సామాన్యులు ముఖ్యంగా మధ్యతరగతివారు సైతం మొగ్గు చూపుతున్నారు. తన వద్దకు కాస్మోటిక్ సర్జరీ కోసం వస్తున్న మహిళలలో గృహిణుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని ప్రముఖ కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ అనిత తెలిపారు. కాస్మోటిక్ సర్జరీ ద్వారా తమ సౌందర్యాన్ని మరింతగా ఇనుమడింపచేసుకోవాలన్న ఆసక్తి గృహిణులలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న నూతన పోకడగా ఆమె తెలిపారు.
ఈ నేపథ్యంలో లిపోసక్షన్ (శరీరంలోని అదనపు కొవ్వును తొలగించే ప్రక్రియ), టుమ్మీ టక్ (పొట్టను తగ్గించే ప్రక్రియ) మరియు రినోప్లాస్టీ (ముక్కును సరిచేసే ప్రక్రియ) తదితర సాధారణ మార్పులను చేయించుకోవడానికి మహిళలు విరివిగా వస్తున్నారని డాక్టర్ అనిత వెల్లడించారు. విద్యార్ధులైన యువతులు రినోప్లాస్టీ సర్జరీ చేయించుకుంటున్నారని అలాగే మధ్య వయస్కులైన మహిళలు లిపోసక్షన్ చేయించుకోవడానికి తమ వద్దకు వస్తున్నట్లు ఆమె తెలిపారు. సర్జీరి తదనంత పరిణామాలు పట్ల పూర్తి అవగాహనతోనే మహిళలు తమను కలుస్తున్నట్లు డాక్టర్ అనిత పేర్కొన్నారు.
గతంలో యువతులు డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనే లక్ష్యాన్ని కలిగి ఉండేవారని, ప్రస్తుతం మారిన కాలమాన పరిస్థితులలో సౌందర్యానికి ప్రాధాన్యత కలిగిన సినిమా మరియు మోడలింగ్ రంగాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని తెలిపారు. దీంతో తమలోని చిన్నచిన్న లోపాలను సరిచేసుకునేందుకు వారు కాస్మోటిక్ సర్జరీని ఆశ్రయిస్తున్నారని డాక్టర్ అనిత పేర్కొన్నారు. విధాత సృష్టికి మెరుగులు దిద్దే ప్రక్రియగా పేరొందిన కాస్మోటిక్ సర్జరీ భారతీయ మహిళను ప్రపంచ స్థాయి సుందరీమణులుగా మార్చిన దృష్టాంతాలు ఎన్నో ఉన్న నేపథ్యంలో మహిళలు కాస్మోటిక్ సర్జరీ వైపు మొగ్గు చూపుతున్న రోజులివి.
|