దశాబ్ద కాలంపైగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల హృదయాల్లో గుబులు రేపుతున్న పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ అద్వితీయ సౌందర్యం వెనుక దాగిన రహస్యం ఏమిటో ఎవరికైనా తెలుసా మరి! ఫిబ్రవరి 22వ తేదీనే కవల పిల్లలకు జన్మనిచ్చిన జెన్నిఫర్ తన సౌందర్య రహస్యాన్ని తానే బయట పెట్టింది.
తన నేత్రాలు, శిరోజాలు, ముఖం, శరీరానికి సరైన మేళవింపుతో తాను ఇస్తున్న బ్యూటీ ట్రీట్‌మెంటే తన సౌందర్య రహస్యం అంటూ సెలవిచ్చిందీ సుందరాంగి. సౌందర్య, సంగీత, నటనా, నాట్యాల కలబోత అయిన ఈ కోమలాంగిని అభిమానులు జెలో అని పిలుచుకుంటూ ఉంటారు.
పదేళ్లకు ముందూ, ఇప్పుడు సైతం తన సుందరరూపం చెక్కు చెదరకుండా స్థిరంగా ఉండడానికి కారణం తాను విపరీతంగా స్నానాన్ని ఇష్టపడటమే అని అంటుంది జెలో. విలక్షణమైన తైలాలతో విస్తృతంగా స్నానం చేస్తూ పోవడమే తన సౌందర్య రహస్యం అంటుందీమె.
"స్నానానికి చాలా సమయం కేటాయిస్తుంటాను. ఒత్తిడినుంచి బయటపడాలంటే ఏకైక మార్గం అదొక్కటే మరి. జో మెలోన్ బాత్ ఆయిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ద్రాక్ష, నిమ్మ, మాండరిన్, ఎర్రగులాబీలు నా ఫేవరైట్లు" అంటుందీ మెరుపు కళ్ల చిన్నది.
ఎల్లప్పుడూ మెరుస్తూ కనిపించే తన కురుల అందాలకు, ముఖ వర్చస్సుకు కారణం, తాను ఎక్కువగా లేపనాలు పూసుకోవడమే అంటుంది జెలో. పొడి వాతావరణం ఉన్న కాలాల్లో తీవ్రంగా మోయిశ్చరైజర్లను వాడతానని అదే తన శరీర నిగారంపుకు మూలమని సెలవిస్తుందీమె.
మై వెడ్డింగ్ ప్లానర్ అనే సినిమాలో కూడా ఇటీవలే నటించిన జెలో, స్వంతంగా తయారుచేసుకున్న సుగంధాలను వాడతాను కాబట్టే ఆకర్షణీయంగా కనబడతానని హొయలు పోతుంది.
|