నిద్రమాని నిరంతరాయంగా చదువుపై దృష్టి కేంద్రీకరించినా, రాత్రిపూట మేలుకుని పనిచేసినా కంటికింద నల్లటి వలయాలు వస్తాయని మనకందరికీ తెలిసిన విషయమే.. ఇలా వలయాలు ఏర్పడినప్పుడు మేకప్ వేసుకున్నప్పటికీ వాటి ఛాయలు పూర్తిగా కనుమరుగవకుండా మనసును నలతపెడుతూనే ఉంటాయి.
అయితే కంటివలయాలకు మేకప్, క్రీములు వాడటం పరిష్కారం కాదని గ్రహిస్తే చాలా మంచిది. అసలు కంటి చుట్టూ వలయాలు ఎందుకు ఏర్పడతాయి. మనోవేదన ఒక్కటే దీనికి కారణం కాదు. ఇంట్లో పనిలో జీవన శైలిలో వేగంగా మార్పులు సంభవిస్తూండటం, ఒత్తిళ్లు, ప్రస్తుతం ఉద్యోగాల్లో తప్పనిసరి అవుతున్న రాత్రి షిఫ్టుల కారణంగా నిద్రలేమి వంటి కారణాలెన్నో ప్రస్తుత తరంలో చాలామంది యువతులకు, మహిళలకు వలయాలను సృష్టిస్తున్నాయి.
అయితే.. కంటి కింద నల్లని వలయాలు రాగానే గాభరాపడిపోవటం, ఉచిత సలహాల ప్రభావానికి గురై మార్కెట్లో దొరికే క్రీములన్నింటినీ వాడటం వల్ల ఎంతో సున్నితంగా ఉండే కంటి చర్మానికి హాని జరుగడం మాత్రం ఖాయం.
ప్రధానంగా నిద్రలేమి, మేలుకుని చదవటం, కంప్యూటర్ ముందు అదేపనిగా పనిచేయడం, రక్తహీనత, గంటలపాటు టీవీ చూడటం, ఇతరత్రా ఒత్తిళ్లతో వచ్చే అనారోగ్య కారణాల వల్లే కంటికింద నల్లని వలయాలు వస్తాయి. కాబట్టి ముందుగా మన కంటి వలయాలకు ఏది కారణమో గ్రహిస్తే దానికి విరుగుడు దొరికి తీరుతుంది.
కంటిచుట్టూ వలయాలకు చిన్న చిన్న సమస్యలు కారణమైతే కింది సూత్రాలను పాటిస్తే సరిపోతుంది. సమృద్ధిగా మంచినీరు తాగండి. వేళకు తిండి తినండి వేళపట్టున నిద్రపోండి. సమతులాహారాన్ని నిత్యం తీసుకోండి. ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, లాక్టిక్ ఆసిడ్, యాంటీ యాక్సిడెంట్లు వంటివి పుష్కలంగా లభించేలా ఆహారం తీసుకోవాలి. రాత్రిపూట నిద్రమానుకుని టివీ చూడటం పూర్తిగా బంద్ పెట్టండి. అతి సర్వత్రా వర్జయేత్ అనే సూత్రాన్ని రోజు పాటించండి. అతిగా మేల్కొనడం, అతిగా చూడటం, అతిగా పనిచేయడం ఈ మూడు చెడులకు దూరంగా ఉండండి.
ఇప్పటికీ కంటి వలయాల సమస్య తగ్గకపోతే వైద్యులతో సంప్రదింపులు తప్పనిసరి.
|