మహిళలు తమ ముఖ కాంతిని పెంచుకోవాలని ఆరాటపడటం సహజం. దీనికోసం ముఖానికి రకరకాల క్రీములు రాస్తుంటారు. అయితే మనం రోజూ వాడే పూలు, పండ్లతోనే ముఖారవిందాన్ని అందంగా మార్చుకోవచ్చంటున్నారు బ్యుటీషియన్లు. సాధారణ చర్మానికి పుచ్చకాయ రసం, కమలా పండు రసం, దోసకాయ గుజ్జు.. ఇలా వేటితోనైనా ముఖానికి మసాజ్ చేసుకోవచ్చు. దోస, అరటి వంటి తీయని పండ్లను కూడా వాడొచ్చంటున్నారు బ్యుటీషియన్లు. ఇవి చర్మానికి కాంతిని తెస్తాయి. అదే జిడ్డు చర్మం ఉన్నవారు పుల్లటి పండ్లను వాడితే మంచిది. బంతి, చేమంతి, గులాబీ వంటి పూల రెక్కలను మెత్తగా రుబ్బి ముఖానికి ప్యాక్ వేస్తే చర్మం నునుపుదనం సంతరించుకుంటుంది. చామంతి పూలలోని కొన్ని రసాయనాలు ఘాటుగా ఉంటాయి కనుక టీనేజ్ దాటినవారు మాత్రమే వాడాలంటున్నారు బ్యుటీషియన్లు. తాజా పూలు అన్ని కాలాల్లో దొరకవు కాబట్టి వాటి రెక్కలను ఎండబెట్టి, పొడి చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాటికి పాలు, నీళ్లు, పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవచ్చు.ఒక టేబుల్ స్పూన్ ద్రాక్షరసాన్ని ముఖానికి, మెడకు అప్లయ్ చేసి అలాగే ఉంచాలి. 15నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ రసం చర్మాన్ని మృదువుగా మార్చి నిగారింపును తీసుకు వస్తుంది. ముఖాన్ని, శరీర చర్మాన్ని తెల్లబరుస్తుందికూడా అంటున్నారు బ్యుటీషియన్లు. |