అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామా మంగళవారం రాత్రి చేసిన విజయ ప్రసంగం సందర్భంగా ఆయన సతీమణి మిషెల్ ధరించిన దుస్తులు ఏ మాత్రం ఫ్యాషనబుల్‌గా లేవని ప్యాషన్ గురూలు పెదవి విరిచారు. మిషెల్ వస్త్ర ధారణను వారు విమర్శించారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వసంత రుతువు సందర్భంగా ప్రముఖ డిజైనర్ నార్సిసో రోడ్రిగెజ్ రూపొందించిన దుస్తులనే కొద్దిగా మార్చి మిషెల్ ఈ విజయ ప్రసంగం సందర్భంగా ధరించారు. అయితే మిషెల్ ధరించిన దుస్తుల పట్ల ప్రజలలో, ఫ్యాషన్ ప్రపంచంలో భిన్నాభిప్రాయాలు వెలువడుతుండటం గమనార్హం. తాను ఒబామాకు ఓటు వేశాను తప్ప మిషెల్ దుస్తులకు మాత్రం కాదని జెస్సికా అనే గృహిణి చెప్పారు. అయితే న్యూయార్క్ లోని ఫ్యాషన్ డైరెక్టర్ జూలీ గిల్‌హర్ట్ మాత్రం మిషెల్‌కు అనుకూలంగా మాట్లాడారు. మీరు ఎలా ఉండదలుచుకున్నారో అలాగే ఉండండి. మీరు ఎలా ఉండాలో ఇతరులు మీకు చెప్పనివ్వద్దు అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అమెరికా తదుపరి ప్రథమ మహిళ మిషెల్‌పై ఓ కన్నేసి ఉంచారనడం వాస్తవం. ఆమె వస్త్రధారణ గురించి లెక్కలేనన్ని విశ్లేషణలు అనుకూలంగా, ప్రతికూలంగా వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవలిసింది ఒకటుంది. మిషెల్ ఒబామా తనకోసం తాను దుస్తులు ధరిస్తున్నారని మర్చిపోవద్దు. ఒబామా ఎన్నికల ప్రచారం వేడి పుంజుకోక ముందునుంచే మిషెల్ అమెరికా మీడియాలో తనదైన విలక్షణ శైలిలో ప్రచారమవుతూ వచ్చారు. 2005 లో 36వ ఇమేజ్ అవార్డుల సందర్భంగా బరాక్ ఒబామాతో మిషెల్ కలిసి ఉన్న భంగిమలోని ఫోటోను మీరు చూస్తే ఆమెకు తనదైన స్త్రీత్వం ఉందని అర్థమవుతుంది. ఎవరన్నారు మిషెల్ తన వస్త్రధారణలో సెక్సీగా లేరని.. |