నవజవ్వనుల విలాసపు నడకలతో వయ్యారాలు పోయే ర్యాంప్ ఇకపై భారతీయ శ్రీమతులకు కూడా చోటు కల్పించనుంది. స్త్రీత్వాన్ని, దాని బహుముఖ రూపాలను వెలికి తెచ్చే ఉద్దేశంతో సనంద అనే బెంగాలీ పత్రిక వివాహిత మహిళలతో ర్యాంప్ షో నిర్వహించనుంది. నీహార్ నాచురల్స్ సనంద శ్రీమతి 2008 పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ పత్రిక వివాహిత మహిళల ప్రతిభా సామర్థ్యాలను వెలికి తీసుకు రావడానికి గాను వారితో ఫ్యాషన్ పెరేడ్‌కు సిద్ధమవుతున్నట్లుగా పేర్కొంది. వైహాహిక జీవితాలలోని మూసపోత ధోరణులలో కొట్టుకుపోయి నిస్సారంగా మారుతున్న శ్రీమతుల జీవితాల్లో కొత్త వెలుగును ప్రోది చేసేందుకు తాము కృషి చేయదలచినట్లుగా పత్రిక ఎడిటర్ మధుమితా చటోపాధ్యాయ్ విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఈ వినూత్నమైన ఫ్యాషన్ పోటీలో పాల్గొనేందుకు వివాహిత మహిళలను ఆహ్వానిస్తామని, వీరినుంచి ఎంపిక చేసిన అభ్యర్థులను తొలి రౌండ్‌లో చేరుస్తామని చెప్పారు. నెలరోజుల పాటు కొనసాగే ఈ సెషన్‌లో పది మంది ఫైనలిస్టులను ఎంపిక చేస్తామని, ఫైనల్లో ఎంపికయిన వారిని ర్యాంప్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తామని చెప్పారు. మహిళల ఆత్మసౌందర్యాన్ని, బలాన్ని ఆవిష్కరించేందుకోసం ప్రశ్న-జవాబు సెషన్ కూడా నిర్వహిస్తామని మధుమిత తెలిపారు. నీహార్ నాచురల్స్ సనంద శ్రీమతి కేవలం అందాలపోటీ మాత్రమే కాదని. ఇది వారి ఆత్మసౌందర్యాన్ని, మానసిక దృఢత్వాన్ని కనుగొనడానికి జరిపే ప్రయాణం కూడా అని గత సంవత్సరం సనంద పోటీలో విజేతగా నిలిచిన అంతర దాస్ రాయ్ చెప్పారు. నెలరోజుల పాటు తీవ్రమైన శిక్షణతో కొనసాగే ఈ కార్యక్రమం మహిళలు తమ్ము తాము వ్యక్తీకరించుకోవాడనికి, తమ శక్తిని ప్రదర్శించడానికి మంచి అవకాశం కల్పిస్తుందని ఆమె చెప్పారు. గత సంవత్సరం జరిగిన పోటీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవడానికి తనకు అవకాశం ఇవ్వడమే గాక తన కలలను ఫలింపజేసుకోవడానికి తగిన సాహసాన్ని కూడా ఇచ్చిందని నందినీ రాయ్ చౌదరి చెప్పారు. గత సంవత్సరం జరిగిన పోటీల్లోఈమె తొలి రన్నర్‌గా వచ్చారు. అది నా జీవితాన్ని మంచి మార్గం వైపు మళ్లించిందని, ఆ కార్యక్రమం తర్పాత అనేక మోడలింగ్ ఒప్పందాలను సాధించగలిగానని, ఆమె చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవకాశాలను సాధించడానికి తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈమె వివాహానంతరం డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం.మొత్తం మీద యువతుల సౌందర్య ప్రదర్శనలకే పరిమితమైన ఫ్యాషన్ పెరేడ్‌లు, అందాల పోటీలు ఇకపై పెళ్లయిన మహిళలకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. |