దశాబ్దాలుగా వంటిళ్లు అనేక మార్పులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఇంటి ముందు వైపు కిచెన్‌లు ఉండగా ఇప్పుడు ఇంటి వెనుక వాటిని అమర్చేలా రూపొందిస్తున్నారు. నేటి కాలంలో కిచెన్ రూపకల్పనలో ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటంటే అవి ఒకప్పటిలా విడిగా, ఓ మూలన ఉండడం కాక డైనింగ్ ఏరియాలో కాని, ఫ్యామిలీ రూమ్‌లో కాని హాలులోకాని భాగంగా ఉండేలా రూపొందించడమే.. ఓపెన్ ఫేస్ కిచెన్ అనేది ఇప్పటి ఫ్యాషన్ అయిపోయింది.
మీ వంటింటి డిజైన్ ఎలా ఉండాలో నిర్ణయించడానికి మీరు ఈ కింది విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ వంటిల్లు ఇంటికి విడిగా ఓ ప్రత్యేక దీవిలాగా ఉండాలా? అది ఆధునిక లేదా సాంప్రదాయ డిజైన్‌లో ఉండాలా? మీ కొత్త కిచెన్ డిజైన్‌కు గాను మీకు ఎలాంటి అనుబంధ ఉపకరణాలు ఉండాలి? వంటింటిలో వెలుతురు ఎలా ఉంటే బాగుంటుంది?
పెద్దగదిగా కిచెన్... మీరు ఇప్పటికే ఉన్న వంటింటికి మార్పులు చేయాలన్నా లేక కొత్త ఇంట్లో వంటింటికి పథకం వేయాలన్నా డిజైన్‌కు సంబంధించిన కొన్ని అంచనాలను ముందే మీ మనసులో ఉంచుకోవాలి. వంటిల్లు పూర్వకాలంలో వలే ఇంటికి విడిగా ఉండాలా లేక ప్రస్తుత అభిరుచులకు అనుగుణంగా ఇంటిలో భాగంగా ఉండాలా అనేది ముందుగా మీరు నిర్థారించుకోవాలి. మీ కిచెన్‌ను సమీపంలో ఉన్న ఫ్యామిలీ రూమ్‌కు లేక డైనింగ్ రూమ్‌కు అనుసంధించి ఉండేలా చేయాలేమో ముందే ప్లాన్ చేసుకోవాలి.
ఇలా ఏదో ఒక దానితో కలిసి ఉండే కిచెన్‌లను గ్రేటర్ రూమ్ లేదా పెద్ద రూమ్ అని పిలుస్తున్నారు. ఇంటిలో భాగంగా కిచెన్ ఉన్నట్లయితే కుటుంబ సభ్యులను లేదా అతిథులను కుక్ చూడడానికి లేక వారితో సంభాషించి అవసరాలు కనుక్కోవడానికి వీలుగా ఉంటుందు కాబట్టి ఇలాంటి తరహా వంటిళ్లు ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్నాయి.
వంటిళ్లు ఎత్తులో ఉండేలా నిర్మిస్తే చూడడానికి పెద్దగాను, ఆకర్షణీయంగాను ఉంటాయి. అగ్గిపెట్టెల్లాంటి పాత కాలపు వంటిళ్లు కనుమరుగువుతూ ఇళ్లలో వంటిళ్లు, బాత్‌రూమ్‌లు విశాలంగా ఉండేలా ప్రస్తుతం నిర్మించబడుతూ ఉండడానికి ఇదే కారణం.
వంటింటిలో కేబినెట్‌లు అమర్చుకుంటే వంటగది మొత్తంగా కొత్త ఆకర్షణతో మెరిసిపోతుంది. మీ కేబినెట్లు ఎలా కనిపించాలనేది మీరు ఎంచుకునే కలపమీద ఆధారపడి ఉంటుంది. సాదాసీదాగా కనిపించేలా చేయాలంటే తేలికపాటి కలప రకాలతో కేబినెట్‌లు తయారు చేసుకోండి. మధ్యరకంగా కనిపించాలంటే ముదురు రంగు కలపను వాడండి.
వంటింట్లో ఒకరు లేదా ఇద్దరు ఉండి వంట చేస్తారా లేక ఒకరే వంట చేస్తారా అనేదాన్ని బట్టి వంటింట్లో కేబినెట్లు మరియు డ్రాయర్లను అమర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని అమర్చాక వంటింట్లో ఎంత స్థలం ఉంటుంది అనేది ముందుగానే అంచనా వేసుకోవాలి. మీ ప్రస్తుత వంటింట్లో వస్తువులు ఎలా అమర్చుకున్నారో క్షుణ్ణంగా పరిశీలించి కొత్త వంటింట్లో చోటును సరిచేసుకుంటే తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది.
వంటింటిలో అమర్చిన కేబినెట్ల లోపలి భాగంలోనూ చక్కటి వెలుతురు ఉండేలా చూడాలి. వంటిళ్లు సాధారణంగా మంచి వెలుతురు తోనే ఉన్నా మూలల్లో, కేబినెట్లు ఉన్న ప్రాంతంలో చీకటిగా ఉండే అవకాశం ఉంది. ఫ్లోరోసెంట్ లైట్లు, సింపుల్ స్పాట్స్ ఉపయోగిస్తే చిన్న వంటిళ్లు కూడా కాస్త విశాలంగా కనబడతాయి.
|