మనకి ఎన్ని దుఃఖాలు దుఖాలు ఎన్నున్నా ఎదుటవారి ముందు బయటపెట్టకుండా ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటే.. మన దుఃఖాలను ఎప్పటికైనా గ్రహించిన మన ఎదుటివారు మనం అడక్కుండానే ప్రతిస్పందిస్తారు. మనం కాదన్నా మన కష్టాల్లో పాలుపంచుకుంటారు. నవ్వుకు అంత శక్తి ఉంది మరి!.
మనకు సంతోషాన్ని పెంచి, మనస్సును ప్రశాంతపరిచి, నాడీ మండలానికి కాస్తంత సేదనిచ్చే నవ్వు మన ప్రమేయం లేకుండానే మనం తీసుకునే ఓ శక్తివంతమైన టానిక్. ఈ టానిక్ మన కార్యదక్షతను పెంచటమే గాకుండా, మనలోని వ్యతిరేక ఆలోచనలను బయటికి వెళ్లగొడుతుంది. సహజసిద్ధమైన నవ్వు సంబంధాలను దృఢతరం చేస్తుంది. చేపట్టిన పనిని ఎంత త్వరగా పూర్తిచేద్దామా అని కాకుండా, ఎంత సరదాగా చేద్దామా అనుకుంటూ చేస్తే ఆ పని మనం అనుకున్న దానికంటే త్వరగా పూర్తవుతుంది. ఈ సరదానే నవ్వు.
ఈ సందర్భంగా మనం ఆస్కార్ వైల్డ్ కొటేషన్‌ను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే... "నవ్వని రోజే మనం పూర్తిగా కోల్పోయిన రోజు అవుతుంది" అన్నారాయన. సమస్త జీవకోటిలో మనిషికి మాత్రమే అలంకారమైన నవ్వును బలవంతంగా ఆపుకోవద్దు. భళ్ళున నవ్వడమే ఆరోగ్యకరమన్న సత్యాన్ని మరువవద్దు.
పబ్లిసిటీ అవసరం ఎంతమాత్రమూ లేని నవరత్నాలను పైసా ఖర్చులేకుండా అందించే ఒకే ఒక్క సూత్రమే "నవ్వు". ఎంత అనారోగ్యమున్నా, ఎన్నెన్ని బాధలున్నా నవ్వుతూ కొన్నిటిని మరచిపోవచ్చు. కొన్ని అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. అంతెందుకు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే ఆయుర్దాయాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే "నవ్వితే నవ రత్నాలు" అన్నారు పెద్దలు. నవరత్నాలన్నింటినీ తనలో ఇముడ్చుకున్న నవ్వు అంటే ఇష్టపడని వారెవరుంటారు ఈ భూప్రపంచంలో....! :))
|